వాచ్‌మన్ హత్య కేసులో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:02 AM
గతనెల 14న రాత్రి లారీ డ్రైవర్ల దాడిలో గాయపడి మృతిచెందిన ముత్యాలనాయుడు హత్య కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారిని రాజాం కోర్టులో హాజరుపరిచామని రూరల్ సీఐ ఉపేంద్రరావు తెలిపారు.
రాజాం రూరల్, సెప్టెంబరు8(ఆంధ్రజ్యోతి): గతనెల 14న రాత్రి లారీ డ్రైవర్ల దాడిలో గాయపడి మృతిచెందిన ముత్యాలనాయుడు హత్య కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారిని రాజాం కోర్టులో హాజరుపరిచామని రూరల్ సీఐ ఉపేంద్రరావు తెలిపారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్ల డించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాజాం మున్సిపాలిటీ పరిధి లోని పొనుగుటివలసకు చెందిన ముత్యాలనాయుడు డోలపేట సమీపంలోని శ్రీలక్ష్మీ నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో నైట్‌వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. గత నెల 14న రాత్రి విశాఖ జిల్లా ఆనందపురం మండలం శిర్లపాలేం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్లు బూర్లె నాగరాజు, కోరాడ చిన్నప్పడు రైస్‌మిల్లు ప్రాంగణం లో మద్యం తాగేందుకు ప్రయత్నించే సమయంలో ముత్యాలనాయుడు విభేదిం చారు. దీంతో వారిద్దరూ ముత్యాలనాయుడిని తీవ్రంగా కొట్టి మంచంపై పడవేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో గాయపడిన ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించి ఈనెల 6న మృతిచెందారు. అందిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఆ ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు.