Share News

tuffan tension తుఫాన్‌ కలవరం

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:53 PM

tuffan tension మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోజువారీ కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

tuffan tension తుఫాన్‌ కలవరం
భోగాపురం: ముక్కాంలో మత్స్యకారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

తుఫాన్‌ కలవరం

జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు

ఇళ్లకే పరిమితమైన జనం

మూడు మండలాల్లో 14 హెక్టార్లలో వరి పంటకు నష్టం

పునరావాస కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోజువారీ కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల పరిస్థితిని రెవెన్యూ, పోలీసు అధికారులు సోమవారం పరిశీలించారు. వర్షం తీవ్రతకు గుర్లలో 8 హెక్టార్లు, జామిలో 5, వంగరలో ఒక హెక్టారు చొప్పున వరి పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాకు నియమించిన ప్రత్యేక అఽధికారి రవిసుభాష్‌ తీర ప్రాంత మండలాల్లో పర్యటించారు. కలెక్టరు రామసుందర్‌ రెడ్డి గంట్యాడ, ఎస్‌.కోట. జామి, ఎల్‌.కోట మండలాల్లోని కంట్రోల్‌ రూంలను తనిఖీ చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంను పరిశీలించి తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సూచనలు ఇచ్చారు.

71 పునరావాస కేంద్రాలు సిద్ధం

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉందని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్‌ సన్నద్ధతను వివరించారు. తుఫాన్‌ ప్రభావం పడే అవకాశం ఉన్న 69 గ్రామాలను ముందే గుర్తించామని, అక్కడి యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశామని తెలిపారు. 8 గ్రామ సచివాలయాల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టామని, పోలీసు సిబ్బందిని సిద్ధంగా ఉంచామని చెప్పారు. పాఠశాల భవనాలు తదితర 71 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటి వద్ద ఆహార పదార్థాలు, మందులు ఉంచామని చెప్పారు. వాగులు, గెడ్డలు, రిజర్వాయర్లు, నదుల్లో నిరంతరం నీటి మట్టాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. సుమారు 60 మంది గజ ఈతగాళ్లను గుర్తించామని చెప్పారు. ప్రసవానికి 10 రోజులు గడువు ఉన్న గర్భిణులను సైతం ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు. మత్య్స కారులంతా సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కడలి కల్లోలం

సుమారు 15 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

భోగాపురం, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి):

మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం కడలి కల్లోలంగా మారింది. ముక్కాం గ్రామం వద్ద సుమారు 15 మీటర్లు ముందుకొచ్చింది. భయపడిన మత్స్యకారులు తీరంలో లంగరు వేసిన బోట్లను గృహాల వద్దకు చేర్చారు. వలలు, ఇతర పరికరాలను కూడా ప్రత్యేక షెల్టర్లలో భద్రపర్చుకున్నారు. కడలి నుంచి పెద్ద శబ్ధాలు రావడంతో హుద్‌హుద్‌ తుఫాన్‌ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. మరోవైపు తీర గ్రామాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా ముక్కాం తీరాన్ని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సోమవారం సందర్శించారు. వేటకు ఎవరైనా వెళ్లారా అని స్థానికులను కలెక్టర్‌ ప్రశ్నించారు. లేదని చెప్పడంతో మరిన్ని జాగ్రత్తలను వివరించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, అక్కడ తాగునీరు, ఆహారం, పాలు సమకూర్చామని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ తుఫాన్‌ తీరం దాటేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు అందించేందుకు పోలీస్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.

తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొందాం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ను సమన్వయంతో సమర్థంగా ఎదుర్కొందామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దత్తిరాజేరు తహసీల్దార్‌ కార్యాలయంలోని కంట్రోలు రూంను సోమవారం పరిశీలించిన అనంతరం ఆయన జిల్లా అధికారులతో వైర్‌లెస్‌ సెట్‌లో మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత వర్షం క్రమేపీ పెరిగే అవకాశం ఉందని, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటవెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. వర్షం కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదన్నారు. రెండు రోజుల్లో ప్రసవం అయ్యే అవకాశం వున్నవారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి మందులు సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.

- తుఫాన్‌ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంను ఆయన సందర్శించారు. తుఫాన్‌ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్‌, డీఆర్‌వో శ్రీనివాస్‌ మూర్తి, సీపీవో బాలాజీ , డీపీఎం రాజేశ్వరి తదితరులు ఉన్నారు.

జిల్లాలో 17.4మీమీ వర్షం

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 17.4 మిల్లీమీటర్లు కురిసింది. అత్యధికంగా కొత్తవలస మండలంలో 46.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మెంటాడ మండలంలో 8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వంగరలో 10.6 మిల్లీమీటర్లు, రేగిడిలో 12.8, సంతకవిటిలో 10.4, రాజాం 13.2, బొబ్బిలి 13.8, ఆర్‌బీపురం 9.4, బాడంగి 13.2, తెర్లాం 11.6, మెరకముడిదాం 14.8, దత్తిరాజేరు 10.4, గజపతినగరం 13, గరివిడి 14.6, చీపురుపల్లి 12.8, గుర్ల 13.2, బొండపల్లి 13, గంట్యాడ 15.2, ఎస్‌.కోట 15, వేపాడ 18, ఎల్‌.కోట 21, జామి 24, విజయనగరం 24.2, నెల్లిమర్ల 17.2, పూసపాటిరేగ 33.4, డెంకాడ 33.8, భోగాపురంలో 26.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.

Updated Date - Oct 27 , 2025 | 11:53 PM