Share News

Excise Department! ఎక్సైజ్‌ శాఖకు కష్టాలు!

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:51 PM

Troubles for the Excise Department! జిల్లా ఎక్సైజ్‌ శాఖ అనేక సమస్యలతో సతమత మవుతోంది. ప్రధానంగా కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. అన్నీ అద్దె గృహాల్లోనే కొనసాగు తున్నాయి. పూర్తిస్థాయిలో సిబ్బంది కూడా లేరు. దీంతో పర్యవేక్షణ కొరవడుతోంది.

 Excise Department!   ఎక్సైజ్‌ శాఖకు  కష్టాలు!
అద్దె గృహంలో నడుస్తున్న పాలకొండ ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయం

  • ప్రతినెలా వేలల్లో అద్దె చెల్లింపు

  • ఏప్రిల్‌ నుంచి కానరాని వెహికల్‌ అలవెన్స్‌

  • సొంత డబ్బుతో డీజిల్‌ కొనుగోలు

  • వేధిస్తున్న సిబ్బంది కొరత .. కొరవడిన పర్యవేక్షణ

జియ్యమ్మవలస, నవంబరు8(ఆంధ్రజ్యోతి): జిల్లా ఎక్సైజ్‌ శాఖ అనేక సమస్యలతో సతమత మవుతోంది. ప్రధానంగా కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. అన్నీ అద్దె గృహాల్లోనే కొనసాగు తున్నాయి. పూర్తిస్థాయిలో సిబ్బంది కూడా లేరు. దీంతో పర్యవేక్షణ కొరవడుతోంది. ఉన్న సిబ్బం దిపై పనిభారం పెరుగుతోంది. మరోవైపు ఫైనాన్షియల్‌ అనుమతి లేక నిధులున్నా వెచ్చించలేని పరిస్థితి.. వెహికల్‌ అలవెన్స్‌ కూడా లేకపోగా.. ప్రతినెలా సిబ్బంది సొంత డబ్బులతో డీజిల్‌ కొను గోలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసర వేళల్లో అవసరమైన చోటుకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు.

అన్నీ అద్దె గృహాలే..

జిల్లాలో సాలూరు, సీతానగరం, పార్వతీపురం, కురుపాం, పాలకొండలలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు సూపరింటెండెంట్‌ కార్యాలయం ఉంది. ఇవన్నీ అద్దె గృహాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా అద్దె కింద ప్రభుత్వం రూ. 71,337 చెల్లిస్తోంది. ఇందులో సూపరింటెండెంట్‌ కార్యాలయానికి రూ. 19,784, కురుపాం సర్కిల్‌ కార్యాలయానికి రూ.6,542, పాలకొండకు రూ. 12,300, పార్వతీపురానికి రూ. 9,684, సీతానగరానికి రూ. 10,722, సాలూరు సర్కిల్‌ కార్యాలయానికి రూ. 12,300 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అద్దె బకాయిలు ఒక్క కురుపాం తప్ప మిగిలిన వాటన్నింటికీ చెల్లిస్తున్నామని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. కురుపాం సర్కిల్‌ కార్యాలయానికి సంబంధించి ఇంటి యజమాని నుంచి అనుమతి రాకపోవడంతో కొంత జాప్యం జరుగుతోందన్నారు.

నిధులు ఉన్నా..

జిల్లాకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌లు ఉంటారు. వీరికి రెండు వాహనాలు, ప్రతి సర్కిల్‌ కార్యాలయానికి ఒక వెహికల్‌ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ ఇవన్నీ అద్దెకు తీసుకున్న వాహనాలే. ఒక్కో వాహనానికి నెలకు రూ. 35 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ డబ్బులతో వాహనానికి అద్దె, నెలకు అవసరమైన డీజిల్‌ వేసుకోవాలి. కానీ ఏప్రిల్‌ నుంచి వీటికి చెల్లింపులు లేవు. దీనికి సంబంధించిన నిధులు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ వద్ద ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్‌ అనుమతి రావడం లేదు. దీంతో వాహనాల అద్దె బకాయి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొందరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది నెలకు అవసరమైన డీజిల్‌ను సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి వస్తోంది.

సిబ్బంది పరిస్థితి ఇదీ..

జిల్లా ఎక్సైజ్‌శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది ఇందులో ఉండగా.. ప్రభుత్వం జిల్లాకు 133 పోస్టులు మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం 78 మందే ఉన్నారు. జిల్లాలోని 15 మండలాలు సాలూరు, సీతా నగరం , పార్వతీపురం, కురుపాం , పాలకొండ సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో ఉన్నాయి. అయితే సిబ్బంది లేక పూర్తి పర్యవేక్షణ కొరవడుతోంది. సర్కిల్‌ కార్యాలయాల్లో ఉన్న కొద్దిపాటి సిబ్బందిలో ఇద్దరు న్యాయస్థానాలకు, మరో ఇద్దరు సెంట్రీ డ్యూటీలు చేయాల్సి ఉంది. మిగిలిన సిబ్బంది ఎప్పటి కప్పుడు గ్రామాల పర్యవేక్షణ చేస్తూ సారా, బెల్ట్‌ షాపుల విషయం తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తుంటారు. గ్రామాల్లో రైడ్లు చేయడంతో పాటు సారా వల్ల కలిగిన అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. దీంతో ఉన్న సిబ్బందికి పని ఒత్తిడి అధికమవుతోంది.

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖలో ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వానికి నివేదించాం. ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాం.

- బి.శ్రీనాథుడు, సూపరింటెండెంట్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 08 , 2025 | 11:51 PM