Share News

Rains! వానొస్తే కష్టమే!

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:59 PM

Trouble If It Rains! తుపాన్లు, భారీ వర్షాల సమయంలో జిల్లాలో కొండవాగులు, గెడ్డలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వరద ఉధృతి కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఒక్కోసారి గ్రామస్థులు గెడ్డ వాగుల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. దీంతో వానొస్తే చాలు.. ఆయా ప్రాంతవాసులు వణికిపోతున్నారు.

  Rains!  వానొస్తే కష్టమే!
ఉధృతంగా ప్రవహిస్తున్న రావాడగెడ్డ

  • పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌

  • వరద ఉధృతికి ప్రాణాలు కోల్పోతున్న వారెందరో..

  • మూగజీవాలూ మృత్యువాత

  • ఏటా వేధిస్తున్న సమస్య

  • శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల విన్నపం

పాలకొండ,సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): తుపాన్లు, భారీ వర్షాల సమయంలో జిల్లాలో కొండవాగులు, గెడ్డలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వరద ఉధృతి కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఒక్కోసారి గ్రామస్థులు గెడ్డ వాగుల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. దీంతో వానొస్తే చాలు.. ఆయా ప్రాంతవాసులు వణికిపోతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లిన వారు గెడ్డ, వాగులను దాటే సాహసం చేయలేక.. స్వగ్రామాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, మూగజీవాల కాపలాకు వెళ్లే వారు సైతం ఏటా వర్షాకాలంలో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి గెడ్డలకు గండ్లు పడితే పంట పొలాలు ముంపునకు గురువు తున్నాయి. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో సాకిగెడ్డ, వరహాలు , ఖానాల, నాగుల, గుమిడి, రాళ్ల, గజాలఖానా, ఓని, ఒట్టి, మల్లి, కుశిమి , గొయిది, చంద్రమ్మ, కొరమ, బొంది, దుగ్గేరు వద్ద సాకి, రావాడ, జంపరకోట తదితర గెడ్డలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల సమయంలో మైదాన ప్రాంతాల గుండా నాగావళి, వంశధార, వేగావతి తదితర నదుల్లో వరద చేరుతుంది. కాగా గడిచిన వారం రోజుల్లో గెడ్డల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. పాలకొండలోని కొండవీధికి చెందిన మత్సకారుడు చేపల వేటకని గోపాలపురం ఓనిగెడ్డలో పడి మృతి చెందాడు. సాలూరు మండలంలో ఓ రైతు పొలానికి వెళ్లే క్రమంలో ఒట్టిగెడ్డలో గల్లంతయ్యాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూగజీవాలు కూడా గెడ్డల్లో కొట్టుకపోయినట్టు ఆయా పాడి రైతులు, పశు పెంపకందారులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ గెడ్డ ప్రాంతాలను పరిశీలించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. గెడ్డ, వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటేఎవరూ అటువైపు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు. చిన్నారులు ఈతకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అయితే గెడ్డల ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మన్యంవాసులు కోరుతున్నారు.

Updated Date - Sep 09 , 2025 | 11:59 PM