Tribal Student Dies జ్వరంతో గిరిజన విద్యార్థిని మృతి
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:39 PM
Tribal Student Dies of Fever హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి కవిత(11) జ్వరంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సీతంపేట రూరల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి కవిత(11) జ్వరంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
సీతంపేట మండలం డొంబంగివలసకి చెందిన మండంగి బాలకృష్ణ, చామంతిలు పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కాగా హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న కవితకు బుధవారం సాయంత్రం జ్వరం వచ్చింది. దీంతో పాఠశాల సిబ్బంది బాలికను సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కవితను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ పరిస్థితి మెరుగవకపోవడంతో గురువారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం బాలిక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఒక్కగానొక్క కుమార్తె అకాల మృతిని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కవిత జ్ఞాపకాలను తలుచుకుని భోరున విలపిస్తున్నారు. మరోవైపు స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కవితకు మలేరియా, టైఫాయిడ్, తెల్లరక్తకణాల సంఖ్య తగ్గు ముఖంతో పాటు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు టెస్ట్‌ల్లో నిర్ధారణ అయ్యిందని ఏపీ గిరిజనసంఘం అధ్యక్షులు లక్ష్మణరావు, కుటుంబసభ్యులు తెలిపారు.