Share News

గిరిజనులు ప్రగతి పథంలో పయనించాలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:17 AM

గిరిజనులు ప్రగతి పథంలో పయనించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ పిలుపునిచ్చారు.

గిరిజనులు ప్రగతి పథంలో పయనించాలి

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు ప్రగతి పథంలో పయనించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని గొరడ గ్రామంలో జట్టు స్వచ్ఛంద సేవాసంస్థ ఏర్పాటు చేసిన వావిలాల గోపాల కృష్ణయ్య స్మారక పురస్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాలొన్నారు. ఈ సందర్భంగా వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. రూ.10 వేల విలువైన పుస్తకాలను అంద జేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పార్వతీపురంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించానని, కష్టపడి చదివి ఈ స్థాయికి ఎదిగానన్నారు. గిరిజన యువత ఉన్నత చదువులు చదవాలని, ఈ గ్రంథా లయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జట్టు సేవా సంస్థ ద్వారా చేపడుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని గిరిజనులను చైతన్యపరిచే అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా జట్టు సేవా సంస్థ వావిలాల గోపాలకృష్ణయ్య స్మారక పురస్కారాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌కు ప్రదానం చేశారు. అనంతరం గిరి జన ప్రజలు, ప్రజా ప్రతినిఽధులు ఆయనకు పౌర సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రజలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, వీరికి వ్యవసాయంలో నూతన మెలకువలను తెలపాలన్నారు. గిరిజన ప్రాంతానికి హైకోర్టు జస్టిస్‌ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి ఎం.బబిత, ఎస్పీ మాధవరెడ్డి, అదనపు జిల్లా న్యాయాధికారి దామోదరరావు, జట్టు సేవా సంస్థ చైర్మన్‌ డి.పారినాయుడు, నాబార్డు డీడీఎం దినేష్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కార్యక్రమానికి హాజరైన హైకోర్టు న్యాయమూర్తికి గిరిజనులు డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సంస్థ గిరిజనులకు రగ్గులను పంపిణీ చేశారు.

Updated Date - Dec 26 , 2025 | 12:19 AM