Kathmandu కఠ్మాండూలో మన్యం వాసులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:15 AM
Tribal People in Kathmandu జిల్లాకు చెందిన సుమారు 40 మంది నేపాల్‌లోని కఠ్మాండూలో చిక్కుకుపోయారు. గత వారం రోజుల కిందట తీర్థయాత్రలకని వారు అక్కడికి వెళ్లారు. ఈ లోపుగా నేపాల్‌లో పరిస్థితి మారిపోయింది.
ఫోన్‌లో ధైర్యం చెప్పిన మంత్రి నారా లోకేశ్
సురక్షితంగా జిల్లాకు తెప్పించేందుకు చర్యలు
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు10(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన సుమారు 40 మంది నేపాల్‌లోని కఠ్మాండూలో చిక్కుకుపోయారు. గత వారం రోజుల కిందట తీర్థయాత్రలకని వారు అక్కడికి వెళ్లారు. ఈ లోపుగా నేపాల్‌లో పరిస్థితి మారిపోయింది. సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నేపాల్ అగ్నిగుండంగా మారింది. నిరసనకారులు దాడులు చేసి.. ఇళ్లకు నిప్పు పెట్టడంతో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తమకు ఎటువంటి ఆహారం, సౌకర్యాలు లేవని గుమ్మలక్ష్మీపురం వాసి నెమలిపురి వెంకట్ వాపోయారు. ప్రస్తుతం ఆర్మీ సంరక్షణలో ఉన్నామని, ఆధార్ కార్డులు పరిశీలిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కఠ్మాండూ ఎయిర్‌పోర్టుకు పంపిస్తామని చెబుతున్నారని వెల్లడించారు. ఇక్కడున్న పర్యాటకుల కోసం ఢిల్లీ నుంచి కఠ్మాండూకు ఐఏఎఫ్ విమానం వస్తున్నట్లు తాము ఉండే హోటల్‌కు భారత రాయబార కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిందని ఆయన తెలిపారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్ కూడా ఫోన్ ద్వారా తమతో మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు. జిల్లాకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆయా మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేశారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఆ తర్వాత కఠ్మాండూలో ఉన్న మన్యం వాసులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.