Tribal People.. గిరిజనం.. ఉన్నత చదువులకు దూరం!
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:21 PM
Tribal People.. Distanced from Higher Education! గిరిజనుల్లో గతం కంటే అక్షరాస్యత పెరిగినా ఉన్నత చదువును మాత్రం కొందరే పొందగలుగుతున్నారు. పేదరికం ఒక కారణం కాగా వారుంటున్న ప్రాంతాలకు దగ్గరలో విద్యా సంస్థలు లేకపోవడం మరో కారణం. గిరిజన గ్రామాలతో పాటు కొండ శిఖర గ్రామాలకు రహదారులు లేకపోవడంతో ఇంకొందరు ఆదిలోనే చదువు ఆపేస్తున్నారు.
పది, ఇంటర్, సాధారణ డిగ్రీలకు పరిమితమవుతున్న యువత
కొండ శిఖర ప్రాంతాల వారి పరిస్థితి మరీ దయనీయం
గిరిజన గ్రామాల్లో గతం కంటే కాస్త మెరుగు
నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సీతంపేట రూరల్, సెప్టెంబరు7(ఆంధ్రజ్యోతి): గిరిజనుల్లో గతం కంటే అక్షరాస్యత పెరిగినా ఉన్నత చదువును మాత్రం కొందరే పొందగలుగుతున్నారు. పేదరికం ఒక కారణం కాగా వారుంటున్న ప్రాంతాలకు దగ్గరలో విద్యా సంస్థలు లేకపోవడం మరో కారణం. గిరిజన గ్రామాలతో పాటు కొండ శిఖర గ్రామాలకు రహదారులు లేకపోవడంతో ఇంకొందరు ఆదిలోనే చదువు ఆపేస్తున్నారు. మొత్తంగా పది, ఇంటర్, సాధారణ డిగ్రీలకే గిరిజన యువత పరిమితమవుతోంది. నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం పురస్కరించుకుని గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతపై ప్రత్యేక కథనం.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో అక్షరాస్యత శాతం ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో వారికి చదువంటేనే తెలియని పరిస్థితి ఉండేది. క్రమేపీ ప్రభుత్వాలు అక్షరాస్యత శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టాయి. దీనిలోభాగంగా గిరిజన గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఆయా గ్రామాల్లో నివసించే వయోజనులకు వాలంటీర్‌లు చదువు చెప్పే వారు. దీంతో నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు అక్షరాస్యులుగా మారారు. అయితే నేటికీ చదువు అంటేనే తెలియని అమాయక గిరిజనులు ఏజెన్సీలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
రోడ్డు లేక..
- ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చే కొమరాడ, సాలూరు, పాచిపెంట, గుమ్మలక్ష్మిపురం తదితర మండలాల పరిధిలోనూ కొండశిఖర గ్రామాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 2,14,839 మంది గిరిజనులున్నారు. అక్షరాస్యత శాతానికి సంబంధించి నిర్దిష్టమైన లెక్కలను అధికారులు చెప్పలేకపోతున్నారు.
- ఉమ్మడి జిల్లాలో కొండ శిఖర గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సదుపాయం లేదు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నా అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదని సగంలో రోడ్ల నిర్మాణాలను ఆపేశారు. దీనివల్ల గిరిజన పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కొండ దిగువనున్న గిరిజన గ్రామాల్లో కూడా దాదాపుగా ఒకటి నుంచి ఐదోతరగతి వరకు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ తరువాత చదువు కోసం మైదాన ప్రాంత గ్రామాలు, పట్టణాలకే వెళ్లాలి. అంత దూరం వెళ్లే అవకాశం ఉండడం లేదు.
- పార్వతీపురం మన్యం జిల్లాలో అక్షరాస్యత శాతం 50.90శాతంగా ఉంది. గతంతో పోల్చుకుంటే అక్షరాస్యత శాతం పెరిగిందనే చెప్పాలి. ఇక సీతంపేట ఏజెన్సీలో 2011 లెక్కల ప్రకారం 75,017 మంది జనాభా ఉండగా వీరిలో పురుషులు 37,373 మంది, మహిళలు 37,644మంది ఉన్నారు. మండలంలో అక్షరాస్యత శాతం 49.34శాతంగా ఉంది.
- గిరిజనుల్లో దాదాపుగా పేద కుటుంబాలు ఎక్కువ. పోడు వ్యవసాయం తప్ప మరే జీవనాధారం ఉండదు. ప్రభుత్వం అందించే విద్యను మాత్రమే పొందగలుగుతున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్య అందుబాటులోకి రాకముందు అందరితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉద్యోగాలు పొందిన గిరిజనుల పిల్లలు మాత్రమే ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. మైదాన ప్రాంత విద్యార్థులతో పోటీపడుతున్నారు. మిగిలిన వారంతా పది, ఇంటర్, సాధారణ డిగ్రీ, పీజీలతో సరిపెట్టుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరు బీఈడీ వంటి సాంకేతిక విద్యను అభ్యసించి నప్పటికీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేకపోతున్నారు. వీరికి ఇంజనీరింగ్, మెడిసన్ విద్యలు అందని ద్రాక్షలే. ఐఐటీ, ఐఐఎంలవంటి జాతీయ విద్యాసంస్థల పేరే తెలియడం లేదు.
సంస్కరణలు చేపడితేనే..
ఏజెన్సీ ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు గ్రామస్థాయిలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను బడిలో చేర్పించాలి. అధికారులు కూడా గిరిజన గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలను పునరుద్ధరించాలి. గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యాలతో పాటు పాఠశాలల ఏర్పాటు చేయాలి. డ్రౌపౌట్స్‌ను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
మార్పులు అవసరం
‘గిరిజన ప్రాంతాల్లో అక్షారాస్యత శాతం పెరగాలంటే గిరిజన విద్యలో సమూల మార్పులు అవసరం. విద్యలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడే అక్షరాస్యత శాతం పెరుగుతుంది. ప్రాథమిక దశలోనే విద్యను బలోపేతం చేయాలి. బడికి దూరంగా ఉన్న చిన్నారులను గుర్తించి బడిలో చేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వయోజన విద్యాకేంద్రాలతో పాటు బాలబడులను పునరుద్ధరించాలి.’ అని సీతంపేట ఐటీడీఏ డిప్యూటీ ఈవో జి.రామ్మోహనరావు అన్నారు.
1966 నుంచి ..
కొన్ని దేశాలు వెనకబడి ఉండడానికి నిరక్షరాస్యతే కారణమని 1965 నవంబరు 17న యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ గుర్తించింది. అక్షరాస్యతను పెంచేందుకు 1966 నుంచి సెప్టెంబరు 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుతున్నారు. మన దేశంలో బీహార్, ఏపీ అక్షరాస్యతలో వెనకబడి ఉన్నాయి.