travelling with dooly is very difficult డోలీ కష్టాలు తప్పేనా?
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:16 AM
travelling with dooly is very difficult శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని గిరిశిఖర గ్రామాల రోడ్ల నిర్మాణానికి నిఽఽధులు అందుబాటులో ఉన్నాయి. పనులు మాత్రం సకాలంలో పూర్తి కావడం లేదు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ తాజాగా అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
డోలీ కష్టాలు తప్పేనా?
ఏజెన్సీలో త్వరితగతిన రోడ్ల అభివృద్ధికి డీప్యూటీ సీఎం ఆదేశం
గిరిజనుల్లో చిగురించిన ఆశలు
పది నెలల క్రితం విడుదలైన పీఎం జన్‌మన్ నిధులు
చిట్టింపాడు, గదబవలస రోడ్డుకు చేపట్టని భూమి పూజ
అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి
శృంగవరపుకోట నియోజకవర్గంలో తప్పని డోలీ మోతలు
శృంగవరపుకోట ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి):
గిరిజన గ్రామాల్లో అడవి తల్లి బాట పేరుతో చేపడుతున్న రోడ్లు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. పీఎం జన్‌మన్ పథకంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, ఉప ప్రణాళిక నిధులతో రహదారుల పనులు చేపడుతున్నాం. రెండు వారాలకోసారి ఈ రోడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష జరిపి నివేదిక అందించాలి. అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులపై ఆశాఖ అధికారులతో సమీక్షిస్తాను. ఈ రోడ్లు పూర్తయితే గిరిజన అవాసాలకు మెరుగైన రహదారి సదుపాయం అందుబాటులోకి వస్తుంది. డోలీ రహిత గిరిజన ప్రాంతాల లక్ష్యం నెరవేరుతుంది.
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో అదివారం ఏర్పాటుచేసిన టెలీకాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశం
శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని గిరిశిఖర గ్రామాల రోడ్ల నిర్మాణానికి నిఽఽధులు అందుబాటులో ఉన్నాయి. పనులు మాత్రం సకాలంలో పూర్తి కావడం లేదు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ తాజాగా అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయన మాటలు గిరిపుత్రులకు ఊరట కలిగించాయి. రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు వారం వారం సమీక్షించడంతో పాటు నివేదికలు అందించాలని అధికారులకు ఆదేశించడంతో ఇకపై రోడ్లు పూర్తవుతాయని భావిస్తున్నారు. అదే జరిగితే డోలీ మోతల బాధ తప్పుతుందని ఆశపడుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. పదేళ్ల క్రితం ప్రారంభించిన పనులను కూడా పూర్తి చేయలేదు. ఇప్పటికీ రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న విధంగా రోడ్ల పరిస్థితి ఉంది. గిరిజన అవాసాల్లో రోడ్ల నిర్మాణానికి కనీస నిధులు కూడా కేటాయించలేదు. కొండ శిఖర ప్రాంతాల నుంచి కిందకు దిగాలంటే కాలినడక తప్పనిసరి కావడంతో అనారోగ్యం బారిన పడినవారు, గర్భిణులను ఆసుపత్రులకు తీసుకువ చ్చేందుకు డోలీ కట్టాల్సి వస్తోంది. నడిచి తీసుకువచ్చే క్రమంలో వైద్యం అలస్యం కావడంతో ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తోంది. సరైన రవాణా సదుపాయం లేక విద్య, విద్యం అందక సామాజికంగానూ వెనుకబాటు తనం అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిశిఖర గ్రామాల రోడ్ల అభివృద్ధిపై దృష్టిసారించింది. అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 130 గిరిజన ఆవాసాలకు 315.54 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.280.53 కోట్లను పీఎం జన్‌మాన్ పథకం కింద నిధులు విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 19 గిరిజన ఆవాసాలకు 50.37 కిలోమీటర్ల పొడవున రహదారుల నిర్మాణానికి రూ.52.03 కోట్లు అందించారు. అయితే పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ రోడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల పనులు చేపట్టి సగంలో ఆపేస్తున్నారు. అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
- గిరిశిఖర గ్రామాలన్నీ అటవీశాఖ భూభాగంలో ఉన్నాయి. రెవెన్యూ భూ భాగం కంటే అటవీ భూభాగం ఎక్కువ. దీంతో రోడ్ల నిర్మాణానికి ఈ శాఖ అనుమతులు తప్పనిసరి. ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ శాఖ తన పరిధిని దాటి తప్పుకొనేందుకు చూస్తోంది. ఇదే అదనుగా రోడ్లు నిర్మాణ పనులను పర్యవేక్షించే అధికారులు అటవీశాఖ అభ్యంతరాల సాకును చూపించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అటవీ శాఖ వద్ద తీసుకున్న భూమికి బదులుగా ప్రభుత్వం వేరే చోట రెవెన్యూతో భూమిని ఇప్పిస్తుంది. అయినప్పటికీ రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అభ్యంతరాలు చెబుతోంది. ఎస్.కోట మండలం దబ్బగుంట, పల్లపు దుంగాడ రోడ్డు ఇందుకు నిదర్శనం. ఈ రోడ్డులో కలుస్తున్న అటవీ శాఖకు చెందిన భూమికి బదులుగా ప్రభుత్వం పెదఖండేపల్లి గ్రామ పరిధిలోని రెవెన్యూ భూమిని అప్పగించింది. అయినప్పటికీ ఈ రోడ్డు పనులు పూర్తికాలేదు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి అత్యంత చొరవ చూపుతున్నప్పటికీ రోడ్లు నిర్మాణాలు పూర్తికావడం లేదు. గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవణ్‌కల్యాణ్ ఈ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో అధికారులు కూడా ఈ రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తున్నారు. కాగా ఎస్.కోట నియోజకవర్గ గిరిశిఖర గ్రామాలన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాలకు రోడ్లు వేయాలంటే అత్యధిక అటవీ భూభాగం ఆ జిల్లాకు చెంది ఉంది. అక్కడి అధికారులు దయ చూపితే తప్ప ఈ రోడ్ల పనులు పూర్తిచేయడం కష్టం. ఏం జరుగుతుందో చూడాలి.