Share News

Traveling... should not be a disruption to life. ప్రయాణం.. కాకూడదు బతుకు ఛిద్రం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:59 PM

Traveling... should not be a disruption to life. రోడ్డు ప్రమాదంలో ఒకరిని కోల్పోతే ఓ కుటుంబమే రోడ్డున పడుతుంది. ఒక్కసారిగా నడి సముద్రంలో నెట్టేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్‌ కనిపించని ఆందోళన చుట్టుముడుతుంది. నలుగురైదుగురు కుటుంబ సభ్యులకు శిక్ష పడిన అనుభవం తోస్తుంది. అందుకే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మన కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని, రూల్స్‌ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణం సాగించాలని మానసిక వేత్తలు చెబుతుంటారు. స్వీయరక్షణే కీలకమంటారు. ఇటు ప్రభుత్వం కూడా ప్రమాదకర స్థలాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ ప్రక్రియ సరిగా జరగక అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు రోడ్డు ప్రమాద మృతుల స్మృతి దినం పురస్కరించుకుని కథనం

Traveling... should not be a disruption to life. ప్రయాణం.. కాకూడదు బతుకు ఛిద్రం

ప్రయాణం.. కాకూడదు బతుకు ఛిద్రం

మానవ తప్పిదంతో నేటికీ ఎన్నో ప్రమాదాలు

అగమ్యగోచరంగా ఆయా కుటుంబాలు

ఇంటి పెద్ద మరణిస్తే.. వీధిన పడాల్సిందే

అందివచ్చిన కొడుకు లేకపోతే తల్లిదండ్రులకు వ్యథే

హెల్మెట్‌ ధారణ, స్వీయరక్షణతోనే ప్రమాదాలకు దూరం

నేడు రోడ్డు ప్రమాద మృతుల స్మృతి దినం

రోడ్డు ప్రమాదంలో ఒకరిని కోల్పోతే ఓ కుటుంబమే రోడ్డున పడుతుంది. ఒక్కసారిగా నడి సముద్రంలో నెట్టేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్‌ కనిపించని ఆందోళన చుట్టుముడుతుంది. నలుగురైదుగురు కుటుంబ సభ్యులకు శిక్ష పడిన అనుభవం తోస్తుంది. అందుకే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మన కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని, రూల్స్‌ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణం సాగించాలని మానసిక వేత్తలు చెబుతుంటారు. స్వీయరక్షణే కీలకమంటారు. ఇటు ప్రభుత్వం కూడా ప్రమాదకర స్థలాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ ప్రక్రియ సరిగా జరగక అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు రోడ్డు ప్రమాద మృతుల స్మృతి దినం పురస్కరించుకుని కథనం

పింఛనుకూ నోచుకోక..

బొబ్బిలిరూరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన మెకానిక్‌ కాజ వేణు ఏడాదిన్నర క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఇంటర్‌ మొదటి సంవత్సరం, కుమారుడు ఏడో తరగతిలో చదువుతున్నారు. అనుకోని ఆ ప్రమాదంతో కుటుంబం అనాదిగా మారి నేటికీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం అందకపోవడంతో ఆమె కూలీ పనులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వేణు మెకానిక్‌గా పనిచేసిన సమయంలో భార్య, బిడ్డలు ఎంతో ఆనందంతో బతికేవారు. ఆమెకు నేటికీ పింఛను కూడా మంజూరు కాలేదు.

----------------

తిన్నావా అని అడిగేవాడు

బొండపల్లి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రతి పూట ఎలా ఉన్నావు.. తిన్నావా అంటూ ఆలనాపాలన చూసే కుమారుడు సతీష్‌ (22) అడిగేవాడు. కొడుకు అకాల మృతితో అనాథగా మిగిలానని తల్లి పురం రామయ్యమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌ 19న బొండపల్లి నుంచి రాచకిండాం వెళ్లే రోడ్డులో బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మూడు కుటుంబాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వారిలో ఒకరు సతీష్‌. నిరాశ్రయు రాలిగా మిగిలానని, ప్రభుత్వం కూడా ఎటువంటి సహకారం అందించకపోవడంతో జీవనం కష్టంగా మారిందని కన్నీరుమున్నీరైంది.

విజయనగరం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి):

ప్రమాదం చెప్పి రాదు.. కానీ నిర్లక్ష్యం చేస్తే అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఇటీవల ఏదోచోట ప్రమాదం జరుగుతూ ఉంది. హెల్మెట్‌ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మైనర్లు వాహనాలు నడపడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే మానవ తప్పిదంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట పడడం లేదు. 2022లో జరిగిన ప్రమాదాల్లో 244 మంది మృతిచెందారు. 925 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 213 మంది చనిపోతే 826 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 230 మంది మృతిచెందితే 815మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఈ 10 నెలల కాలంలో దాదాపు 166 మంది వరకూ మృత్యువాత పడగా 650 మంది క్షతగాత్రులయ్యారని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ద్విచక్ర వాహన ప్రమాదాలకు సంబంధించి ఎక్కువగా హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలుస్తుండడం ఆందోళనకరం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టిసారించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ..ప్రమాదాలు జరిగి మూల్యం చెల్లించుకున్న తరువాత అయ్యో అని బాధపడుతున్నారు.

వారి బాధలు చెప్పలేనివి..

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలు, బాధిత కుటుంబాలు పడుతున్న వ్యథ అంతా ఇంతా కాదు. ప్రమాదం జరిగినప్పుడు కనికరం చూపే వారు తరువాత పట్టించుకోరు. సొంతవారు సైతం అయ్యోపాపం అనడమే తప్ప ఆదుకోవడం అరుదు. ప్రధానంగా ఇంట్లో పిల్లలు ప్రాథమిక విద్య చదువుతున్నప్పుడు ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబ వ్యధ అంతా ఇంతా కాదు. చేతికి అందివచ్చే కుమారుడు లేకపోతే తల్లిదండ్రుల బాధ చెప్పలేనిది. అందుకే రోడ్డు ప్రమాదం అంటే ఒకరి సమస్య కాదు. ఎన్నో కుటుంబాలతో ముడిపడే అంశం అన్న విషయాన్ని గ్రహించాలి. అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు తమ ప్రయాణాల సమయంలో కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలి.

వెనుక పరమార్థం అదే..

సాధారణంగా పోలీసుల తనిఖీని తప్పుగా అర్థం చేసుకుంటాం. వారు జరిమానాలు విధించినా.. కేసులు నమోదుచేసినా.. దాని వెనుక ఉండే లక్ష్యం రోడ్డు ప్రమాదాల నియంత్రణే అన్న విషయం గ్రహించాం. అటు హెల్మెట్‌ ధరించాలని చెబుతున్నా పెడచెవిన పెడుతుంటాం. ఈ ఏడాది మార్చి 1 నుంచి హెల్మెట్‌ ధారణకు సంబంధించి కీలక ఆదేశాలు వచ్చాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో కఠిన నిబంధనలు, జరిమానాలు అమల్లోకి వచ్చాయి. అయినా సరే వాహనదారుల్లో మార్పురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి1 కంటే ముందు హెల్మెట్‌ లేకుండా ప్రయాణానికి సంబంధించి రూ.135 జరిమానా వేసేవారు. మారిన నిబంధనలతో రూ.1000 కట్టాల్సిందే. లైసెన్స్‌ లేకుండా బండి నడిపితే రూ.10 వేలు వసూలు చేస్తారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగితే కేసులు నమోదుచేస్తారు. 90 రోజుల్లో జరిమానా కట్టకపోతే బండి సీజ్‌ చేస్తారు. గత నాలుగు నెలల్లో హెల్మెట్‌ ధరించని వారిపై నమోదైన కేసులు 1329, లైసెన్స్‌ లేనివారు 1437 మందిపై కేసు నమోదుచేసినట్టు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి.

కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలి

ఏఆర్‌ దామోదర్‌ ఎస్పీ

నవ్వుతూ ఇంటినుంచి బయటకు వెళ్లిన భర్త లేదా కుటుంబాన్ని పెంచిపోషిస్తున్న కొడుకు రోడ్డుప్రమాదంలో మృతి చెందితే ఆ బాధ వర్ణణాతీతం. అదుకుంటున్నవారు, కూడు పెట్టిన వారు కరువైతే వారి పరిస్థితి అగమ్యగోచరం. ఈ విషయాన్ని వాహనదారులు గుర్తు పెట్టుకోవాలి. ప్రయాణంలో ఉన్నా కూడా కుటుంబం గురించి ఆలోచించాలి. నిదానమే ప్రధానం. వేగమంతమైన ప్రయాణం మంచిది కాదు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రయాణం సాగిస్తే ఎలాంటి అపాయం కలగదు. ఇదే లక్ష్యంతో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుంటారు.

----------------------

Updated Date - Nov 15 , 2025 | 11:59 PM