పార్వతీపురం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల రద్దు
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:38 PM
జిల్లా కేంద్రం పార్వతీపురం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖాధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పార్వతీపురంటౌన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖాధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, డొంకిన వలస రైల్వేస్టేషన్ల పరిధిలో జరుగుతున్న మూడోలైన్ పనుల నేపథ్యంలో ఈనెల 19 నుంచి 27 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా విజయనగరం వరకు నడపనున్నట్లు చెప్పారు. ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖపట్నం-రాయపూర్ పాసింజర్ (58258), విశాఖ-కోరాపుట్ డీఎంయూ(58538), విశాఖ-భవానీపట్నం పాసింజర్(58504), రాయపూర్-విశాఖ పాసింజర్(58257), కోరాపుట్-విశాఖ డీఎంయూ( 58537), భవానీపట్నం-విశాఖ పాసింజర్(58503)ను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 26 వరకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్(17243) విజయనగరం వరకే నడుస్తుందన్నారు. ఈనెల 20 నుంచి 27 వరకు రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) విజయనగరం నుంచి బయలుదేరుతుందని అన్నారు. 21 నుంచి 27వ తేదీ వరకూ దుర్గు-విశాఖ వందే భారత్(20829) మూడు గంటలు ఆలస్యంగా, 24, 26 తేదీల్లో నాందేడ్-సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్(20810) నాలుగు గంటలు ఆలస్యంగా, 21 నుంచి 27వ తేదీ వరకూ విశాఖపట్నం- దుర్గు వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20830) 2.30 గంటలు ఆలస్యంగా నడుస్తాయని అన్నారు. ఈనెల 20, 21, 23, 24, 26 తేదీల్లో విశాఖ-నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్(12807) 5 గంటల ఆలస్యంగా బయలు దేరుతుందని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.