trains for booking శుభకార్యాలకు రైళ్లు!
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:18 AM
trains for booking ఇకపై శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రైలులో సులువుగా ప్రయాణించవచ్చు. రైల్వేశాఖ చాలా తక్కువ ఖర్చుతో సామాన్యులకూ ఉపయోగపడేలా కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.
శుభకార్యాలకు రైళ్లు!
నెల రోజుల ముందస్తు బుకింగ్‌కు అవకాశం
100 మందికిపైగా ఉంటే నేరుగా ఆఫ్‌లైన్‌లో
ఆన్‌లైన్‌లో సైతం దరఖాస్తుకు చాన్స్
గరిష్టంగా 24 బోగీల వరకూ..
భారత రైల్వేశాఖ వెసులబాటు
రాజాం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఇకపై శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రైలులో సులువుగా ప్రయాణించవచ్చు. రైల్వేశాఖ చాలా తక్కువ ఖర్చుతో సామాన్యులకూ ఉపయోగపడేలా కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్రకారం రైలులో కొన్ని బోగీలను కాని, మొత్తం కోచ్‌లను కాని బుక్ చేసుకోవచ్చు. ఒకేసారి వందలాది మంది బంధుమిత్రులు, స్నేహితులు కలిసి వెళ్లవచ్చు. సమీపంలోని పెద్ద రైల్వేస్టేషన్లకు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదిస్తే చాలు. ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకటి లేదా రెండు బోగీలను బుక్ చేసుకునే వెసులబాటూ ఉంది. గరిష్టంగా 24 బోగీలు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇలా ముందస్తు బుకింగ్‌కు బోగికి ఇంత అని కొంత డబ్బులు చెల్లించాలి. ప్రయాణించే బోగీలు, దూరం బట్టి ధర ఉంటుంది. అయితే ఒక్కో బోగికి రూ.50 వేల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రెండు బోగీలు కావాలంటే రూ.2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. 18 బోగీలు అయితే రూ.9 లక్షలు చెల్లించాలి. బోగిల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల సంఖ్యను లెక్కిస్తారు. వారు ప్రయాణించే స్టేషన్‌కు ఉన్న ధరను లెక్కకడతారు. ప్రయాణికుల సంఖ్యను అనుసరించి మాత్రమే డబ్బులు తీసుకుంటారు. మిగతా మొత్తాన్ని 10 రోజుల్లో తిరిగి ఇస్తారు.
నేరుగా కార్యాలయానికి సంప్రదిస్తే..
వాల్తేరు డివిజన్ పరిధిలో 106 స్టేషన్లు ఉన్నాయి. మన జిల్లాకు సంబంధించి విజయనగరం, చీపురుపల్లి, కొత్తవలస, బొబ్బిలి..అలాగే పక్కన ఉన్న పార్వతీపురం, సాలూరు, శ్రీకాకుళం రోడ్ వంటి స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 100 మందికిపైగా ప్రయాణికులు ఉంటే వాల్తేరు డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో కమర్షియల్ అధికారిని నేరుగా సంప్రదించాలి. అది కూడా మనం అనుకున్న తేదీకి నెల రోజుల ముందు సంప్రదించాల్సి ఉంటుంది. మరోవైపు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ప్రత్యేక యాప్ సైతం అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి ఎఫ్‌టీఆర్ ఐఆర్‌సీటీసీ అని టైప్ చేస్తే వెబ్‌సైట్ వస్తుంది. దానిలో వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. తరువాత బోగీ కావాలా? రైలు కావాలా? అనే ఆప్షన్ వస్తుంది. ఒక వేళ రైలులోని బోగీలన్నీ కావాలని అనుకుంటే 18 నుంచి 24 బోగీలు బుక్ చేసుకోవాల్సిందే. అయితే ఒక బోగీలో 78 మంది మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. మిగతా సీట్లను ఇతర ప్రయాణికులకు కేటాయిస్తారన్న మాట. మొత్తానికైతే సామాన్యులు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లోనే ఉంటాయి. సాధారణ టిక్కెట్ ధర కంటే 10 శాతం అదనం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల టిక్కెట్ ధరల కంటే రైలు ప్రయాణం కొంత చౌకగానే ఉంటుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
-----------------