Traditionally toolellu సంప్రదాయబద్ధంగా తొలేళ్లు
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:56 AM
Traditionally toolellu జై పైడిమాంబ అంటూ భక్తుల నామస్మరణ ఒకవైపు.. పురోహితుల వేదమంత్రోచ్ఛారణ మరోవైపు.. డప్పులు, పులివేషాల సందడి ఇంకోవైపు నడుమ సోమవారం తొలేళ్ల సంబరం సంప్రదాయబద్ధంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు.
సంప్రదాయబద్ధంగా తొలేళ్లు
అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు
కోలాహలంగా ఘటాల ఊరేగింపు
విజయనగరం రూరల్/కల్చరల్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జై పైడిమాంబ అంటూ భక్తుల నామస్మరణ ఒకవైపు.. పురోహితుల వేదమంత్రోచ్ఛారణ మరోవైపు.. డప్పులు, పులివేషాల సందడి ఇంకోవైపు నడుమ సోమవారం తొలేళ్ల సంబరం సంప్రదాయబద్ధంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. సోమవారం వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవ అనంతరం పైడిమాంబ దర్శనానికి దేవదాయశాఖ భక్తులకు అనుమతిచ్చింది. ఉదయం 8 గంటల సమయంలో పూసపాటి వంశీయులు, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు సతీసమేతంగా వచ్చి పుట్టింటి కానుకగా చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అశోక్ కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా ఉన్నారు. తొలేళ్ల ఉత్సవంలో భాగంగా ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. (తొలియేరు.. తొలేళ్లుగా భక్తులు భావిస్తారు. సంవత్సరంలో మొట్టమొదటి విత్తనం అని అర్థం) సోమవారం రాత్రి 12 గంటల సమయంలో చదురుగుడి వద్ద ఈ తంతు జరిగింది. అంతక ముందు హుకుంపేట నుంచి ఘటాలను చదురుగుడికి తీసుకువచ్చారు. మేళతాళాలు, పులివేషాలు, ఇతర నేల వేషాలు నడుమ ఘటాలను చదురుగుడి నుంచి కోటలో వున్న కోట శక్తి వరకూ తీసుకువచ్చారు. అక్కడ పూజలు అనంతరం మళ్లీ చదురుగుడికి ఎదురుగా ఘటాలను ఉంచారు. రాత్రి 12 గంటలు దాటిన తరువాత భక్తులు అధిక సంఖ్యలో ఘటాలకు పూజలు చేశారు.
- పైడిమాంబను తొలేళ్ల ఉత్సవానికి సిద్ధం చేసే క్రమంలో ఆదివారం రాత్రి 10.45 గంటలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వివిధ నదీజలాలతో అభిషేకించారు. అలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, పైడిమాంబ భక్తుల సమక్షంలో ఈ తంతు జరిగింది. అనంతరం తొలేళ్ల ఉత్సవానికి పైడిమాంబను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.