Share News

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:23 AM

జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అధికారులు గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు.

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- గిరిజనులకు ఉపాధి కల్పించాలి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అధికారులు గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆదికర్మ యోగి పథకంలో భాగంగా స్థానిక గిరిజనులతో కలిసి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి వారికి ఉపాధి కల్పించాలన్నారు. డోలీ మోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రోడ్లు లేని గ్రామాలను గుర్తించి అవసరమైన మేరకు సర్వే చేసి మంజూరు అనుమతులు పొందాలన్నారు. రోడ్లు శంకుస్థాపన దగ్గర నుంచి ప్రారంభించే వరకూ ఎంపీడీవోలే బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుత సీజన్‌లో జ్వరాలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, అటువంటి కేసులు ఉన్న ఆసుపత్రులను ఎండీపీవోలు ప్రతిరోజూ సందర్శించి వైద్యసేవలను పర్యవేక్షించాలన్నారు. అన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. ఆరుబయట చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ అని దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో రానున్న మూడు మాసాలు ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

Updated Date - Oct 24 , 2025 | 12:23 AM