Tourism Works పర్యాటక పనులు వేగవంతం
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:04 AM
Tourism Works Accelerated ఐటీడీఏ పరిధిలో పర్యాటక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. రెండో రోజు బుధవారం సీతంపేట ఏజెన్సీలో ఆయన పర్యటించారు. తొలుత స్థానిక ఎన్‌టీఆర్ అడ్వంచర్ పార్క్, మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించారు.
సీతంపేట రూరల్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలో పర్యాటక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. రెండో రోజు బుధవారం సీతంపేట ఏజెన్సీలో ఆయన పర్యటించారు. తొలుత స్థానిక ఎన్‌టీఆర్ అడ్వంచర్ పార్క్, మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించారు. అక్టోబరు మొదటి వారానికి పార్క్ అభివృద్థి పనులన్నీ పూర్తిచేయాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. వెదురుతో ఆర్చ్‌ను తయారు చేయించాలని , పెయింటింగ్స్ వేయించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా సెల్ఫీపాయింట్లు ఏర్పాటు చేయాలని, గిరిజన యువత వివిధ రకాల దుకాణాలు నిర్వహించు కునేందుకు అనుమతి ఇవ్వాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్‌ను ఆదేశించారు.
జలపాతం వద్ద రక్షణ చర్యలు
మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకులు ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా జలపాతం వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫొటోషూట్‌కు అనుకూలంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. అనంతరం ఆ ప్రాంతానికి సమీపంలో పీఎం జన్‌మాన్ కింద గిరిజనులు నిర్మించుకుంటున్న గృహాలను కలెక్టర్ పరిశీ లించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా మండ గ్రామానికి చేరుకుని వన్‌ధన్ వికాస్, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. గిరిజన మహిళలు తయారుచేస్తున్న కొండచీపుర్లను పరిశీలించారు. మార్కెటింగ్ సదుపాయం, వాటి తయారీకి అయ్యే ఖర్చు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు.
మనుమకొండ అభివృద్థికి కృషి
నీతి అయోగ్, ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద ఆదర్శ గ్రామంగా ఎంపికైన మనుమకొండను అన్ని విధాలుగా అభివృద్థి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో భామిని మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘ నీతిఅయోగ్ సూచించిన 40సూత్రాలను అమలు చేయాలి. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపర్చాలి. మోడల్ అంగన్‌వాడీ భవనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. గ్రామస్థులకు ఆరోగ్యకార్డులు అందించాలి. మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు ఉండాలి. ప్రతి చెరువునూ ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్థి చేయాలి. ఫాంపాండ్స్ పనులు చేపట్టి నీటి నిల్వ చేయాలి.’ అని తెలిపారు. సర్పంచ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్థికి అవసరమయ్యే పనుల ప్రణాళికలను తయారుచేయాలని సూచించారు. ఇకపై నిర్వహించే సమీక్షలకు ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీవో జి చిన్నబాబు, డీడీ అన్నాదొర తదితరులు పాల్గొన్నారు.