Share News

tortoise facing bad situations అయ్యో.. తాబేళ్లు

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:57 PM

tortoise facing bad situations సముద్ర కాలుష్యాన్ని అదుపు చేస్తూ ఇతర జీవుల మనుగడకు దోహద పడే తాబేళ్లకు మృత్యుకాలం దాపురించింది. తీరంలో ఎక్కడికక్కడే కళేబరాలు కంటపడుతున్నాయి. కొన్ని తీరానికి కొట్టుకొస్తున్నాయి. వాటిని చూస్తున్న పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.

tortoise facing bad situations అయ్యో.. తాబేళ్లు
ముక్కాం తీరంలో మృతి చెందిన తాబేలు

అయ్యో.. తాబేళ్లు

తీరంలో మృత్యు ఘోష

వందలాదిగా కళేబరాలు

ఆవేదన చెందుతున్న ప్రకృతి ప్రేమికులు

వలలకు చిక్కుతున్నాయా?

కాలుష్య ప్రభావంతోనూ మృత్యువాత

భోగాపురం, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): సముద్ర కాలుష్యాన్ని అదుపు చేస్తూ ఇతర జీవుల మనుగడకు దోహద పడే తాబేళ్లకు మృత్యుకాలం దాపురించింది. తీరంలో ఎక్కడికక్కడే కళేబరాలు కంటపడుతున్నాయి. కొన్ని తీరానికి కొట్టుకొస్తున్నాయి. వాటిని చూస్తున్న పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 28 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. గత 15రోజుల నుంచి తీరం పొడవునా తాబేళ్ల కళేబరాలు కంటపడుతున్నాయి. వాటిని జంతువులు పీక్కుతినడంతో దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సమయంలో అవి గుడ్లు పెట్టడానికి తీరానికి వస్తాయి. డిసెంబరు నుంచి మార్చి వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంగా చెబుతారు. ఇలా వస్తూ మృత్యువాత పడుతుండడం అందరినీ బాధిస్తోంది. ఈఏడాది జనవరి మాసంలో కూడా జిల్లా తీరంలో 500 తాబేళ్ల కళేబరాలను గుర్తించినట్లు జిల్లా ఫారెస్టు అధికారులు తెలిపారు. వాటి మనుగడకు ముప్పు తెస్తున్న కారణాలపై ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చే సమయంలో కొన్ని తాబేళ్లు వలలకు చిక్కి మృతిచెందుతున్నాయి. సముద్రంలో బోట్లుపై వేట సాగించే వారు పెదటేకు, నానాజాతి, అటుకో, కోన, కండవ రకాల వలలు వినియోగిస్తుంటారు. ఆ వలలను సుమారు 20నుంచి 30 కిలోమీటర్లు లాక్కువస్తారు. ఆ సమయంలో వలలకు చిక్కి ప్రతికూల వాతావరణంలో తాబేళ్లు చనిపోతున్నట్లు అధ్యయన వేత్తలు చెబుతున్నారు. తాబేళ్లు సముద్రం అడుగున ఉన్నప్పటికీ ప్రతీ 45 నిమిషాలకు నీటి పైకి వచ్చి గాలి పీల్చుకొని మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. అయితే గుడ్లు పెట్టడానికి, గాలి పీల్చుకోవడానికి వస్తున్నప్పుడు తాబేళ్లు వలలకు చిక్కుతున్నా యంటున్నారు. అలాగే తీరం వెంబడి ఉన్న పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాల నుంచి కూడా ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏదేమైనా తాబేళ్లు మృతి చెందకుండా ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని, తాబేళ్ల జాతి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అలాగే బోట్లుపై వేట సాగించే మత్స్యకారులకు ప్రభుత్వం అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు భావిస్తున్నారు. ఏపీ మెరైన్‌ ఫిషరీస్‌ రెగ్యులేషన్‌ చట్టప్రకారం తీరం నుంచి 8 కిలోమీటర్ల అవతల మాత్రమే చేపలవేట చేయాలి. ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ప్రమాదకర వలలను నిషేధించాలి.

- తాబేళ్లు సముద్రంలో నాచును ఆహారంగా తీసుకొని దాని ఉత్పత్తిని నియత్రిస్తుంటాయి. సముద్రంలో కాలుష్యాన్ని ఉత్పత్తి చేసే జల్లి చేపలను కూడా తాబేళ్లు ఆహారంగా తీసుకొంటాయి. అలాగే సముద్రంలోని కొండలు, గుట్టల్లో చేపలు గుడ్లు పెట్టే ప్రాంతాలను సైతం తాబేళ్లు శుభ్రం చేస్తుంటాయి. దీంతో మత్స్య సంపద వృద్ధి చెందుతుంది. అన్ని విధాలా ఉపయోగకరమైన సముద్రపు తాబేళ్లు డిసెంబరు నెలలోనే వందలాదిగా మృత్యువాత పడుతుంటే భవిష్యత్‌లో ఇంకెన్ని మృత్యువాతపడతాయోనని సముద్ర ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారి పూజను వివరణ కోరగా తాబేళ్లు మృతి చెందకుండా చూస్తామని, మత్స్యకారులకు అవగాహన కలిగిస్తామని, ఇతర రక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.

- వారం కిందట తీరంలో సుమారు 50నుంచి 60 తాబేళ్లు చనిపోయాయి. గుడ్లు సంరక్షించేవారు వాటిని చూసి పూడ్చేశారు. మర బోట్లపై చేపల వేటసాగించేవారు కండవ, కొనా వలలు వేసి లాక్కొంటూ వెళ్లేటప్పుడు అందులో చిక్కుకున్న తాబేళ్లు బయటికి రాలేక మృతి చెందుతున్నాయి. వాటిని తీసి సముదరంలో పడేస్తుంటారు. ఎక్కువగా ఒడిశా వైపు నుంచి తాబేళ్లు కెరటాలకు కొట్టుకొస్తున్నాయంటున్నారు. తాము వేటసాగించే వలలకు తాబేళ్ల్లు చిక్కితే ప్రాణంతోనే మళ్లీ సముద్రంలో విడిచిపెడుతుంటామని, కండవ, కొనా వలలు కారణంగానే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయని ముక్కాం మత్స్యకారులు చెబుతున్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:57 PM