రాజాంలో కుండపోత వర్షం
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:59 PM
రాజాంలో మంగళవారం కుండపోత వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం మూడుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వర్షం కురవడంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు.
రాజాం రూరల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):రాజాంలో మంగళవారం కుండపోత వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం మూడుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వర్షం కురవడంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. మెయిన్‌రోడ్ మీదుగా మురుగునీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రీకాకుళం రోడ్‌లో ద్విచక్రవాహనచోదకులు అవస్థలకు గురయ్యారు. ఇదే రోడ్ లోని సప్తగిరికాలనీతోపాటు మల్లిఖార్జునకాలనీలో ఇళ్లల్లోకి మురుగునీరంతా చేరడంతో ఇళ్లలో ఉంటున్నవారు ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లల్లోకి చేరిన నీటిని తొలగించేం దుకు శ్రమించాల్సివచ్చింది.ఈశ్వరనారాయణ కాలనీలోని ఐదులైన్లు, బాబానగర్, నరసిం హనాయుడుకాలనీ తదితర కాలనీల్లోకి వెళ్లేందుకు పలువురు ఇబ్బందులు పడ్డారు. బొబ్బిలిరోడ్‌లో పలువీధుల్లోని మురుగునీరంతా మెయిన్‌రోడ్ మీదుగా రెండు అడుగుల మేర ప్రవహిస్తూ శ్రీకాకుళంరోడ్‌లో కిలోమీటరు మేర నిలిచిపోయింది. గొల్లవీధి, చాకలి వీధి, రెళ్లివీధి, మెంటిపేట ఎస్సీ కాలనీల్లో మురుగునీటి నిల్వలు పేరుకుపోయాయి.
వీఆర్వోలు అప్రమత్తంగా ఉండాలి
రేగిడి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి):మండలంలోని నాగావళి నదీతీరంలోగల తొమ్మిది లోతట్టు గ్రామాలకు తుఫాన్ దృష్ట్యా జిల్లా వరద హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు మంగళవారం బొడ్డవలస, ఖండ్యాం, వెంకటాపురం, గదబపేట, పుర్లి, రేగిడి, కందిశ, పాతచెలిగానవలస, తునివాడ తదితర లోతట్టు గ్రామాల్లో వీఆర్వోలు దండోర వేసి అప్రమత్తంచేశారు. భారీ వర్షాల వల్ల నదిపొంగే ప్రమాదముందని, ఎవరూ నది వద్దకు వెళ్లొద్దని అప్రమత్తంచేసినట్లు తహసీల్దార్ కృష్ణలత తెలిపారు. నిరంతరం అప్రమ త్తంగా ఉండాలని వీఆర్వోలకు వరద హెచ్చరికలు జారీఅయ్యాయి.