Torrential Rain ముంచెత్తిన వాన
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:12 AM
Torrential Rain బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం కారణంగా గురువారం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి పొలాలు నీట మునిగాయి. అరటి, మొక్కజొన్న నేలవాలాయి.
ముంపులో గ్రామాలు.. పంటలు
నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు..
కరెంట్ సరఫరాకు ఆటంకం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
పార్వతీపురం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం కారణంగా గురువారం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి పొలాలు నీట మునిగాయి. అరటి, మొక్కజొన్న నేలవాలాయి. ప్రధాన కూడళ్లు, రోడ్లపై వర్షపునీరు నిలిచింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో విజయ దశమి రోజున ప్రజలకు పండుగ సందడి లేకుండాపోయింది. కాగా ఈనెల 4 వరకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు ఈ 08963-796085 నెంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. శుక్రవారం పాఠశాలలకు ఆయన సెలవు ప్రకటించారు.
వర్షపాతం నమోదు ఇలా..
సీతంపేట మండలంలో అత్యధికంగా 72.9 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గరుగుబిల్లి మండలంలో 17.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వీరఘట్టం-51, భామిని-65.2, పాలకొండ-48.6, కొమరాడ-70.3, గుమ్మలక్ష్మీపురం-72.2, కురుపాం-64.1, జియ్యమ్మవలస 54.7, పార్వతీపురం-41.5, మక్కువ-32.9, సీతానగరం-35.5, బలిజిపేట-48.6, సాలూరు-38.1, పాచిపెంట-51.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్న
విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. శుక్రవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి జిల్లాలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈదురుగాలులకు కారణంగా నేలకొరిగిన చెట్లును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ పరిస్థితి
- పార్వతీపురం మండలం వెంకంపేట గోలీలు వద్ద భారీ చెట్లు నేలకొరిగాయి. వీరఘట్టం మండలంలో అరటితోటలు నేలకొరిగాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించింది.
- గరుగుబిల్లి: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో నాగావళి నది వరద ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చింది. గురువారం పైప్రాంతాల నుంచి 4,500 క్యూసెక్కులు చేరగా, స్పిల్‌వే గేట్లు నుంచి 14 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. శుక్రవారం 33 వేల క్యూసె క్కులు చేరగా 14,650 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే మళ్లీ 46 వేల క్యూసెక్కుల వరద చేరింది. అధికారులు అప్రమత్తమై 28 వేల క్యూసెక్కులను విడిచిపెట్టారు. సాగునీటి అవసరాల నిమిత్తం 720 క్యూసెక్కులను ప్రధాన కాలువల నుంచి సరఫరా చేస్తున్నారు. మరోవైపు నదీ తీర ప్రాంతవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
- భామిని మండలంలో గెడ్డవాగులు ఉప్పొంగాయి. వంశధార నదీ తీర ప్రాంతాల్లో పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. దిమ్మిడిజోల నుంచి సతివాడ వెళ్లే మార్గంలో చెట్లు నేలకొరిగాయి. మొక్కజొన్న పత్తి, వరిపేరు నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన చెందారు. పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ శుక్రవారం వరద ప్రాంతాన్ని పరిశీలించారు. బత్తిలికి చెందిన పశువుల కాపర్లు గురువారం ఇంటికి చేరకపోవడంపై ఆరా తీశారు. నేరడి, లివిరి నదతీర ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే జయకృష్ణ పేర్కొన్నారు. ఘనసర, కీసర, కోసలి, సింగిడి గ్రామాల్లో పర్యటించారు.
- కొమరాడ: కళ్లికోట జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆ గ్రామానికి నాగావళి నదికి మధ్యలో భారీగా వరద నీరు చేరింది. దీంతో గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు 25 ఎకరాల వరకూ వరి, క్యాబేజీ తదితర పంటల్లో నీరుచేరింది. కళ్లికోట గ్రామానికి ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు నివేదిక తయారుచేసి పరిహారం చేస్తామని చెప్పారు. కాగా జంఝావతి, నాగావళి నదుల సంఘంలో ఉన్న గుంప సోమేశ్వరాలయం ఆలయం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీటిలో చిక్కుకుంది. ఆలయం మీద గోపురానికి దగ్గరగా నీరు ప్రహిస్తోంది.
- గుమ్మలక్ష్మీపురం భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలినట్టు తహసీల్దార్ శేఖరం తెలిపారు. సెంటర్‌గూడలో ఒక ఇళ్లు, పెంగువ, వాడపుట్టి గ్రామాల్లో ఒక్కొక్క ఇళ్లు కూలిపోయాయన్నారు.
- జియ్యమ్మవలస: నిర్వాసిత గ్రామం బాసంగిని నాగావళి వరద నీరు చుట్టు ముట్టింది. దీంతో నిర్వాసితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు గ్రామస్థులు విషయాన్ని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి తెలియజేశారు. శుక్రవారం ఆమెతో పాటు సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ ఆ గ్రామాన్ని పరిశీలించారు. బాసంగి, కళ్లికోట, సుంకి గ్రామాల్లో నిర్వాసితులు పడుతున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ విప్ హామీ ఇచ్చారు.
- పాలకొండ: ఓని సమీపంలో గెడ్డపై కాజ్‌వేపై నుంచి వరదనీరు ప్రవహించడంతో గుడివాడ, ఓని, స్కాట్‌దొరవలస తదితర గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా రావాడగెడ్డ కాజ్‌వేపైకి వరదనీరు చేరడంతో అవలంగి, ఆర్‌బిఆర్‌పేట, డోలమడ, ఎం.సింగుపురం వాసులకు అవస్థలు తప్పలేదు.
- మక్కువ రూరల్ : దుగ్గేరు, నందలో మొక్కజొన్న, అరటి పంటలకు భారీనష్టం వాటిల్లింది.
ప్రాణనష్టం జరగకుండా చూడగలిగాం
సాలూరు: వర్షాలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తవల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ వర్షం తీవ్రతపై పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడానన్నారు.