Share News

రేపు ప్రతిగ్రామంలోనూ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:55 AM

జిల్లాలో ఈ నెల 15వ తేదీన ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు.

రేపు ప్రతిగ్రామంలోనూ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

  • యాప్‌లో కార్యక్రమం వివరాలు నమోదు

  • కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశాలు

పార్వతీపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 15వ తేదీన ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో కార్యక్రమాల వివరాలను నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో గురువారం సబ్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రీసర్వే పక్కాగా జరగాలని, దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న గృహనిర్మాణాల్లో పెండింగ్‌ ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పీఎంఏవై 1.0 కింద ఇళ్లు మంజూరై వివిధ దశల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్‌ విలువకు అదనంగా ఆర్థిక సాయం అందిస్తుందన్న విషయం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఆ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామసభలో వచ్చిన విజ్ఞప్తులపై మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మ్యుటేషన్‌, అడంగల్‌ వంటి సమస్యలపై తదితర వాటిపై తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కేఆర్‌ఆర్‌ ప్రత్యేక ఉప కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు

23 నాటికి గృహ నిర్మాణాల సర్వే పూర్తి చేయాలి

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేని మార్చి 23వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిని కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 20వ తేదీ నాటికి మొదటి దశ పూర్తి చేస్తే 21వ తేదీ నాటికి వారిఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:55 AM