Share News

నేడే తొలేళ్ల సంబరం

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:47 AM

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, భక్తుల కొంగుబంగారం పైడిమాంబ అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం జరగనుంది.

నేడే తొలేళ్ల సంబరం
రథాలకు రంగులు వేస్తున్న దృశ్యం

- ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

- పైడిమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు

- 2,600 మంది పోలీసులతో బందోబస్తు

విజయనగరంరూరల్‌/కల్చరల్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, భక్తుల కొంగుబంగారం పైడిమాంబ అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం జరగనుంది. సిరిమానోత్సవానికి ముందు జరిగే ఈ తొలేళ్ల ఉత్సవం కోసం దేవదాయశాఖ, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకోనున్నారు. తొలేళ్ల ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉత్సవం జరిగే రోజు రాత్రి చదురుగుడి వద్ద ఉన్న అమ్మవారి ఆలయం నుంచి పూజారి బంటుపల్లి వెంకటరావు ఘటాలతో ఊరేగింపుగా కోటకు వెళ్తారు. కోట ముఖద్వారం వద్ద ఉన్న కోట శక్తి అమ్మవారిని పూజిస్తారు. అనంతరం చదురుగుడి వద్ద రైతులకు విత్తనాలు అందిస్తారు. ఈ విత్తనాలు జల్లితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. సోమవారం రాత్రి అమ్మవారి వనంగుడి, చదురుగుడి ప్రాంతాల్లో పలు అధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పలువురు ప్రముఖులు పైడిమాంబను దర్శించుకోనున్నారు. తొలేళ్లు, సిరిమాను సంబరం ముగిసే వరకూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అమ్మవారి ఆలయానికి ఇరువైపులా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 2,600 మంది పోలీసులతో బందో బస్తు నిర్వహించనున్నారు. 124 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, 10 డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బందికి బాడిఓన్‌ కెమెరాలు అందించారు. మరికొంత మందిని మఫ్టీలో నియమించారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు కూడళ్లు వద్ద మూడెంచెల భద్రత కోసం ఇనుప కంచెలు పెట్టారు. తొలేళ్ల ఉత్సవంలో నేల వేషాలు, ముఖ్యంగా పులివేషాలు సందడి చేయనున్నాయి.

సిద్ధమైన సిరిమాను రథాలు

విజయనగరం కల్చరల్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ జాతరలో ప్రధాన ఘట్టమైన మంగళవారం జరిగే సిరిమానోత్సవం కోసం రథాలు సిద్ధమయ్యాయి. సిరిమాను తిప్పే రథాలు, అంజలి, జాలరి రథాలకు సంబంధించిన చక్రాలను అధికారులు అమర్చారు. ఆలయ పూజారి బంటుపల్లి బైరాగినాయుడు నివాసం హుకుంపేటలో ఆదివారం సిరిమాను, రథాలకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సిరిమాను తయారుచేసిన ప్రాంతంలోనే మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ ప్రాంతంలో పోలీసు, అటవీశాఖ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల్లోపే హుకుంపేటలో సిరిమానుకు పూజలు నిర్వహించి, అనంతరం అక్కడినుంచి చదురుగుడి వద్దకు తరలించనున్నారు. ఈ మేరకు అధికారులు, రూట్‌మ్యాప్‌ కూడా సిద్ధం చేశారు.

50వేల లడ్డూలు..

తొలేళ్లు, సిరిమానోత్సవం కోసం వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రసాదాలను సిద్ధం చేశారు. సోమ, మంగళవారం ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 50వేలకు పైగా లడ్డూలు, 30వేలకు పైగా పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. 80 గ్రాముల లడ్డూ రూ.15, వంద గ్రాముల పులిహోర ప్యాకెట్‌ రూ.10కి విక్రయించనున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:47 AM