Today is the Sirimanotsavam. నేడే సిరిమానోత్సవం
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:53 AM
Today is the Sirimanotsavam. పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమైంది. అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి ఇప్పటికే విజయనగరం చేరుకుంది. కొద్ది గంటల్లో వారి కోరిక నెరవేరనుంది. మరోవైపు పండుగ ఘడియల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
నేడే సిరిమానోత్సవం
సిరిమానుపై అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తకోటి ఎదురుచూపు
మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభం కానున్న ఊరేగింపు
పట్టు వస్త్రాలు సమర్పించనున్న దేవదాయశాఖ మంత్రి
పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమైంది. అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి ఇప్పటికే విజయనగరం చేరుకుంది. కొద్ది గంటల్లో వారి కోరిక నెరవేరనుంది. మరోవైపు పండుగ ఘడియల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
విజయనగరం రూరల్/ కల్చరల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
అంజలి రథం.. జాలరి వల..పాలధార.. తెల్ల ఏనుగు పరివారంతో పైడిమాంబ నడిచే దేవతగా భక్తులకు దర్శనమిచ్చే ఘట్టమే సిరిమానోత్సవం. ఏటా దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం నిర్వహించే ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పైడిమాంబ ప్రతి రూపంగా ఆలయ పూజారి 50 అడుగుల చెట్టు మాను చివరన కూర్చుని భక్తులను ఆశీర్వదించనున్నారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి నుంచి కోట వరకూ మూడు పర్యాయాలు సిరిమాను తిరుగుతుంది. ఈ ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చీకటి పడకముందే సిరిమానోత్సవాన్ని ముగించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో దశాబ్దకాలంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సంబంధిత శాఖ మంత్రి లేదా జిల్లాకు చెందిన మంత్రి పైడిమాంబకు పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు పైడిమాంబ ఆలయాన్ని దర్శించుకోనున్నారు.
తొమ్మిదోసారి సిరిమాను అధిరోహణ
విజయనగరం కల్చరల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబ సిరిమానోత్సవం తిలకించడం ఓ అనుభూతి. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు మంగళవారం తొమ్మిదో సారి సిరిమానుపై నుంచి భక్తులను ఆశీర్వదించనున్నారు. విజయనగరంలోని హుకుంపేటకు చెందిన ఈయన ఇప్పటి వరకూ 8సార్లు సిరిమాను అధిరోహించారు. అంతకుముందు ఆయన మేనమామ పతివాడ భాస్కరరావు ఎనిమిది సార్లు అధిరోహించారు. ఆయనకన్నా ముందు వెంకటరావు తండ్రి బంటుపల్లి బైరాగినాయుడు 27 సార్లు సిరిమానును అధిరోహించారు. పూర్వం నుంచి పతివాడ, బంటుపల్లి వారసులే సిరిమానుపై కూర్చోవడం ఆనవాయితీగా వస్తోంది. సిరిమాను అధిరోహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆలయ ప్రధాన పూజారి వెంకటరావు చెప్పారు. ఉత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తులు సిరిమానోత్సవాన్ని తిలకించి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. కోట , పైడిమాంబ ఆలయ వెనుక ప్రాంతం, అంబటిసత్తర్వు కూడలిని సోమవారం ఆయన పరిశీలించారు. బారికేడ్‌ల ఎత్తును, వాటి పటిష్టతను పరిశీలించారు. మంగళవారం సిరిమానోత్సవ సమయంలో ప్రజలంతా అమ్మవారిని సులువుగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. ఉదయం 10.30 గంటలకు సిరిమాను రథం హుకుంపేటలో బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకోవాలని, అక్కడ రథం ఏర్పాట్లు పూర్తి చేసి 3 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభించేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ దామోదర్, ఏఎస్‌పీలు సౌమ్యలత, సహాభాజ్ అహ్మద్, పైడిమాంబ దేవస్థానం ఈవో కె.శిరీష, ఆర్‌డీవో దాట్ల కీర్తి తదితరులు ఉన్నారు.
ఉత్సవానికి పటిష్ఠ భద్రత
ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ పండుగకు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పిస్తామని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. ఆలయ పరిసరాలను సోమవారం ఉదయం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. పండుగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 120 సీసీ కెమెరాలు, 12 డ్రోన్‌లతో నిఘా పెట్టామన్నారు. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టామన్నారు. కమాండ్ కంట్రోల్ రూంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.