Share News

To Study చదువుకోవాలంటే కొండ దిగాల్సిందే!

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:32 PM

To Study, One Must Descend the Hill సీతంపేట మన్యంలో గిరిజన చిన్నారులకు బడి కష్టాలు తప్పడం లేదు. రోజూ కొండ దిగి, గుట్టలు దాటి కిలోమీటర్ల మేర నడిచి పాఠశాలలకు చేరుకోవాల్సి వస్తోంది.

To Study చదువుకోవాలంటే  కొండ దిగాల్సిందే!
కొండదిగి మర్రిపాడు పాఠశాలకు వెళ్తున్న ఉసిరికిపాడు గిరిజన విద్యార్థులు

  • బడికి చేరాలంటే వాగులు, గుట్టలు దాటాల్సిన దుస్థితి

  • రహదారుల్లేక వర్షాకాలంలో తీవ్ర అవస్థలు

  • గిరిజన పాఠశాలల్లో సౌకర్యాలు కరువు

  • రేకుల షెడ్లు, పురిపాకల్లోనే బోధన

  • అత్యధికులు డ్రాపౌట్లుగా మారుతున్న వైనం

సీతంపేట రూరల్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో గిరిజన చిన్నారులకు బడి కష్టాలు తప్పడం లేదు. రోజూ కొండ దిగి, గుట్టలు దాటి కిలోమీటర్ల మేర నడిచి పాఠశాలలకు చేరుకోవాల్సి వస్తోంది. ప్రధానంగా ఉసిరికిపాడు, మూలగూడ, రంగంవలస, గూడంగి, ఎగువ ద్వారబంధం, దిగువ ద్వారబంధం తదితర గిరిశిఖర గ్రామాల చిన్నారులకు నిత్యం ఈ అవస్థలు తప్పడం లేదు. సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి కొండ దిగిన తర్వాత బాషా వలంటీర్‌ సాయంతో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. గ్రామాలకు రోడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో వారి బాధలు రెట్టింపువుతున్నాయి. మరోవైపు బడులకు పక్కా భవనాలు లేకపోవడంతో రేకుల షెడ్లు, పురిపాకల్లోనే వారు అక్షరాలు నేర్చుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొండ దిగితేకాని చదువుకోలేని పరిస్థితి నెలకొనడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి దూరం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారులకు తెలిసినా.. కనీస చర్యల్లేవని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్‌ మండలాల్లో 191 గిరిజన ప్రైమరీ పాఠశాలలు (జీపీఎస్‌) ఉన్నాయి. వీటిల్లో సుమారు 4వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, 40 పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. జగతిపల్లి, ఎగువదారబ, రాయిలంక, మూల లంక, చిన్నపల్లంకి తదితర పాఠశాలలను రేకులషెడ్లు, పురిపాకల్లో నిర్వహిస్తున్నారు. వర్షం పడితే నీరు కారిపోతుండడంతో గిరిజన చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలో 75 పాఠశాలలు ఉండగా వీటిలో 12 పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. ఇక్కడ కూడా రేకుల షెడ్లలోనే విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. చావిడివలస, మర్రిపాడు, కిరప, కిండంగి, కిల్లాడ, సీది, మానాపురం పాఠశాలల్లో ఒక్క భవనంలోనే ఐదు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో ఆరుబయట పిల్లలను కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. దీంతో అష్టకష్టాల నడుమ అడవి బిడ్డల చదువులు సాగుతున్నాయి.

వైసీపీ సర్కారు నిర్లక్ష్యం.. కూటమి చొరవ

గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. నాడు-నేడు పథకంలో భాగంగా అదనపు భవనాల నిర్మాణాలకు అరకొర నిధులను మంజూరు చేసింది. దీంతో మన్యంలోని చాలా వరకు పాఠశాలలు పక్కా భవనాలకు నోచుకోలేదు. కొన్నిచోట్ల పునాది దశలోనే పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఎస్‌ఎస్‌ఏ (సమగ్ర శిక్షా అభియాన్‌) నిధులతో సీతంపేట మన్యంలో ఏడు పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తోంది. ఈ పనులు చివరిదశకు చేరుకున్నాయి.

పెరుగుతున్న డ్రాపౌట్లు

గిరిజన గ్రామాల్లో డ్రాపౌట్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం గిరిజన విద్య బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రాపౌట్ల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి వారిని బడిలో చేర్పించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. డ్రాపౌట్‌గా మారిన విద్యార్థులు కొండపోడు, కూలీ పనులు చేసుకుంటూ ఇంటికే పరిమితమై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పక్కా భవనాలు లేని గిరిజన ప్రైమరీ పాఠశాలల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. విద్యార్థుల సమస్యలను కూడా అందులో ప్రస్తావించాం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

-జి.రామ్మోహనరావు, డిప్యూటీ ఈవో

===================================

ఏడు పాఠశాలలకు పక్కా భవనాలు

రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల వివరాలను ఇటీవలే ప్రభుత్వానికి పంపాం. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడులో కింద మంజూరైన పాఠశాలల భవనాలు పునాది దశలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం గిరిశిఖర గ్రామాల్లో ఉన్న ఏడు పాఠశాలలకు పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ పనులు జరుగుతున్నాయి.

ఆనందరావు, ఎంఈవో, సీతంపేట

Updated Date - Sep 16 , 2025 | 11:32 PM