To quit 'addiction'.. ‘మత్తు’ వీడాలని..
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:02 AM
To quit 'addiction'.. గంజాయి వ్యాపారం చేస్తూ పోలీసులకు, చట్టానికి దొరక్కుండా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నానని ఫొటోలోని మొదటి వ్యక్తి దర్జాగా కూర్చొని చెబుతున్నాడు. రెండో వ్యక్తి పోలీసులకు దొరికిన తరువాత లాయర్‌కు డబ్బులు ఇచ్చి బెయిల్ మీద బయటకు వచ్చానని, అమాయకులు ఇంకా జైలులోనే ఉన్నారని అంటున్నాడు.
‘మత్తు’ వీడాలని..
యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ ప్రయత్నం
గంజాయికి దూరంగా ఉండాలని సదస్సులో సూచనలు
తాజాగా పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు సైకిల్ యాత్ర
- గంజాయి వ్యాపారం చేస్తూ పోలీసులకు, చట్టానికి దొరక్కుండా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నానని ఫొటోలోని మొదటి వ్యక్తి దర్జాగా కూర్చొని చెబుతున్నాడు. రెండో వ్యక్తి పోలీసులకు దొరికిన తరువాత లాయర్‌కు డబ్బులు ఇచ్చి బెయిల్ మీద బయటకు వచ్చానని, అమాయకులు ఇంకా జైలులోనే ఉన్నారని అంటున్నాడు. గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో రుజువు కావడంతో సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోయి పేదవానిగా మిగిలిపోయానని, జైలు జీవితం గడుపుతున్నానని మూడో వ్యక్తి వాపోతున్నాడు. వివిధ వేషధారులతో ఎస్.కోట పోలీసులు ఐదు రోజుల కిందట ఏర్పాటు చేసిన ప్రదర్శనిది. అందరినీ ఆలోచింపజేసింది.
- డ్రగ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన కోసం పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సౌకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్) టోల్‌ఫ్రీ నెంబర్ 1972 ఆకారంలో విద్యార్థులను నిల్చోబెట్టి ప్రదర్శన ఏర్పాటు చేశారు. తద్వారా చట్టం గురించి తెలుసుకోవడంతో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌ను సులువుగా గుర్తించుకుంటారనేది వారి ఆలోచన.
శృంగవరపుకోట, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):
గంజాయిని కట్టడి చేయడంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించాలన్న సంకల్పంతో పోలీసులు వినూత్న పంథాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలు పెడుతున్నారు. ర్యాలీలు చేపడుతున్నారు. తాజాగా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టీ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు అభ్యుదయం పేరుతో సైకిల్ యాత్ర చేపట్టారు. దారి పొడవునా గంజాయికి దూరంగా ఉండాలని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.
వాస్తవానికి గంజాయి రవాణాపై ఇప్పటికే నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. చాలా మంది పట్టుబడుతున్నారు. వారిని జైల్లో పెట్టి త్వరితగతిన శిక్షలు పడేటట్లు ప్రయత్నిస్తున్నారు. గంజాయి అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ గంజాయి రవాణా ఆగడం లేదు. దొరికినప్పుడల్లా వంద నుంచి ఐదొందల కేజీల వరకు పట్టుబడుతోంది. ఒక్కోసారి వెయ్యికేజీలు ఉంటోంది. ఇంత పెద్దమెత్తంలో గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలించడంలో స్థానిక యువత సహకారం ఉన్నట్లు పోలీస్ శాఖకు గుర్తించింది. గంజాయి రవాణా సమయంలో దొరికిన వారిలో స్థానికులే ఎక్కువగా ఉంటున్నారు. వ్యాపారులు పట్టుబడినా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బెయిల్‌పై బయటకు వచ్చేస్తున్నారు. వీరు మాత్రంలో జైల్లోనే ఉంటున్నారు. పరిస్థితి మారాలని బలంగా నిర్ణయించుకున్న విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి వినూత్నంగా అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు అభ్యుదయం పేరుతో సైకిల్ యాత్ర చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో వారం రోజులుగా ర్యాలీ నడుస్తోంది. ఎస్పీ ఏఆర్ దామోదర్ సైకిల్ యాత్ర ఆగే ప్రతి స్టేషన్ వద్ద గంజాయి రవాణా, వాడకంతో జరిగే నష్టాలు, కేసులు, ఆస్తుల జప్తుతో పాటు సమాచారం ఇచ్చేందుకు వున్న టోల్ ఫ్రీ నెంబర్ 1972ను ప్రదర్శిస్తున్నారు. ఆటలు, పాటల రూపంలోనూ అవగాహన కల్పిస్తున్నారు.
గంజాయి వైపు యువత
ఒడిశా రాష్ట్రం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాకు సరిహద్దుగా ఉంది. ఈ సరిహద్దు ప్రాంత కొండల్లో గంజాయిని పండేంచేలా వ్యాపారులు పెట్టుబడులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గంజాయి రవాణాను అడ్డుకోవడమే మానేశారు. దీంతో విచ్చవిలవిడి తనం పెరిగింది. ఈ వ్యాపారం ద్వారా సులభంగా డబ్బులు రావడంతో స్థానిక యువత చూపు అటు మళ్లింది. గంజాయి వాడకానికి కూడా అలవాటు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. అలవాటు పడిన వారు కేసులు నమోదవుతున్నా జంకడం లేదు. రూట్లు మార్చి రవాణాకు సిద్ధపడుతున్నారు.
గంజాయి రవాణా ఇలా..
అరకు, అనంతగిరి నుంచి శృంగవరపుకోట, కొత్తవలస మీదుగా గంజాయిని విశాఖకు తరలిస్తున్నారు. మధ్యలో బొడ్డవర చెక్ పోస్టు వద్ద తనిఖీలు జరుగుతున్నాయని తెలిస్తే చిలకల గెడ్డ పైనుంచి ఉన్న అడ్డదారిలోకి వెళ్తున్నారు. ఆపై తాటిపూడి రోడ్డుపైకి వచ్చి విజయనగరం మీదుగా విశాఖకు తరలిస్తున్నారు. లేదంటే ఆండ్ర, మెంటాడ, గజపతినగరం మీదుగా విజయనగరం, సాలూరు, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం మీదుగా కూడా రవాణా జరుగుతోంది. ఇలా అనేక రూట్లలో పోలీస్ నిఘా బట్టి వారిని తప్పించుకొని తరలించుకుపోతున్నారు. గంజాయి రవాణాలో స్థానికుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు పోలీస్‌లకు సమాచారం ఇచ్చి గంజాయి పట్టుబడేటట్లు చేస్తున్నారు. ఈ సమయంలో గంజాయి రవాణాకు సహకరిస్తున్న స్థానిక యువత పట్టుబడుతోంది. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
- గంజాయి మత్తుపదార్థం. దీన్ని అక్రమంగా ఉత్పత్తి చేసినా, రవాణా చేసినా, కొనుగోలు, అమ్మకం చేసినా చట్టప్రకారం నేరం. ఈ విషయం కొంత మందికి తెలియక గంజాయి వ్యాపారుల ఉచ్చులో పడుతున్నారు. ఇలా పడకుండా ఉండేందుకు పోలీస్ శాఖ చేస్తున్న ఈ ప్రయత్నం కొంత వరకైనా సఫలీకృతమవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఫొటోరైటప్స్: 25కోట1: గంజాయితో జరిగే పరిణామాలపై వేషధారులతో ప్రదర్శన ఏర్పాటు చేసిన పోలీసులు(ఫైల్)