Share News

..to Odisha ..టు ఒడిశా

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:04 AM

..to Odisha ఈ ఏడాది అక్టోబరు 10న బొబ్బిలి మండలం పెంట గ్రామం నుంచి రేషన్‌ బియ్యాన్ని గుట్టుగా తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో అధికారులు వేగావతి నది వంతెన సమీపంలో రైడ్‌ చేసి పట్టుకున్నారు. సుమారు 15 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌ చేశారు.

..to Odisha ..టు ఒడిశా

..టు ఒడిశా

జిల్లా నుంచి బియ్యం రవాణా

రూటు మార్చిన అక్రమార్కులు

కట్టడి చేయడంలో యంత్రాంగం విఫలం

- ఈ ఏడాది అక్టోబరు 10న బొబ్బిలి మండలం పెంట గ్రామం నుంచి రేషన్‌ బియ్యాన్ని గుట్టుగా తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో అధికారులు వేగావతి నది వంతెన సమీపంలో రైడ్‌ చేసి పట్టుకున్నారు. సుమారు 15 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌ చేశారు.

- ఈ నెల 14న పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద 25 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడింది. జిల్లా నుంచి లారీలో ఒడిశాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఒడిశాలోని జైపూర్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

విజయనగరం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు తగ్గలేదు కానీ అవి పట్టుకెళ్తున్న రూటూ మాత్రం మారింది. పాత రోజుల్లో కాకినాడ పోర్టుకు గుట్టుగా తరలించేవారు. ఇప్పుడు ఒడిశా రాష్ట్రానికి తీసుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ పంపిణీకి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. వాటిల్లోనే కొంతమంది నేరుగా కార్డుదారుడి నుంచి కిలో బియ్యం రూ.12 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేసేవారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యాపారం ఇట్టే జరిగిపోయేది. వ్యాపారులతో ముందస్తు ఒప్పందం ప్రకారం కిలో రూ.20లకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఇలా స్టాకు చేసిన బియ్యంను గోదాముల్లో నిల్వ ఉంచి.. లారీలు, వ్యానుల్లో మిల్లులకు కొంత, కాకినాడ పోర్టుకు మరికొంత, ఒడిశాకు ఇంకొంత తరలించేవారు. మిల్లర్లకు ఎక్కువగా రీపాలిష్‌కు వెళ్లేది. కాగా కాకినాడ పోర్టుకు చీకటి మార్గంలో భారీగా తరలించి వ్యాపారులు సొమ్ము చేసుకునేవారు. ఈ విషయం బయటకు పొక్కి కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో అక్రమార్కులు రూటుమార్చారు. ఇప్పుడు ఒడిశా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

పేదల బియ్యం పక్కదారి..

జిల్లాలో 8.57 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా 14,426 టన్నుల బియ్యం అందిస్తున్నారు. 25 శాతం మంది ఈ రేషన్‌ బియ్యం వినియోగించడం లేదు. ఇదంతా పక్కదారి పడుతోంది. తద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీ వృథా అవుతోంది. ఒక్క మన జిల్లాలోనే రేషన్‌ రాయితీ రూపంలో రూ.175 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. కొవిడ్‌ సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ బియ్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతూనే ఉంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తోంది. అయితే ఇలా ఇస్తున్న బియ్యాన్ని చాలా మంది విక్రయిస్తున్నారు. గతంలో నేరుగా లబ్ధిదారుల నుంచి డీలర్లే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు కొందరు వ్యాపారులు ఇదో వృత్తిగా పెట్టుకున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ కిలో బియ్యాన్ని రూ.15 నుంచి రూ.20 వరకూ కొనుగోలు చేస్తున్నారు. వాటినే మిల్లర్లకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మిల్లర్లు ఇచ్చిన సొమ్ముతోనే వారు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కిలో దగ్గర రూ.5 నుంచి రూ.10 వరకూ కమిషన్‌ తీసుకుంటున్నారు. ఇదే బియ్యాన్ని మిల్లర్లు లెవీకి చూపించి సొమ్ము చేసుకుంటున్నారు.

రేషన్‌ బియ్యాన్ని లెవీగా..

సాధారణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంది. వారు ఏడాది పొడవునా మిల్లింగ్‌ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ఇందుకుగాను క్వింటా మిల్లింగ్‌ చేసేందుకు ప్రభుత్వం రూ.60 చెల్లిస్తుంది. అయితే ఇక్కడే కొందరు మిల్లర్లు దగా చేస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని నేరుగా లెవీగా చూపుతున్నారు. చిరు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేయించిన బియ్యాన్నే మిల్లింగ్‌ చేసిన బియ్యంగా చూపుతున్నారు. దీనిపై ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరముంది.

===============

Updated Date - Dec 20 , 2025 | 12:04 AM