Share News

To grow on par with other communities ఇతర వర్గాలతో సమానంగా ఎదగాలి

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:01 AM

To grow on par with other communities ఇతర వర్గాలతో పాటు ఎస్సీలు కూడా సమానంగా ఎదగేలా చూడాలని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ అధికారులకు సూచించారు. ఎస్సీల పట్ల సానుభూతి కాకుండా వారి బాధలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని సహానుభూతి చూపించాలన్నారు.

To grow on par with other communities ఇతర వర్గాలతో సమానంగా ఎదగాలి
మాట్లాడుతున్న ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌

ఇతర వర్గాలతో సమానంగా ఎదగాలి

ఎస్సీలకు సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందాలి

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇతర వర్గాలతో పాటు ఎస్సీలు కూడా సమానంగా ఎదగేలా చూడాలని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ అధికారులకు సూచించారు. ఎస్సీల పట్ల సానుభూతి కాకుండా వారి బాధలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని సహానుభూతి చూపించాలన్నారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టరేట్‌ వద్ద అధికారులు స్వాగతం పలికారు. అంతకుముందు జడ్పీ సమావేశ అతిథిగృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 45 మంది విన్నపాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, ఎస్పీ దామోదర్‌తో కలిసి కలెక్టరు చాంబర్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ జవహర్‌ మాట్లాడుతూ సంగీత సాహిత్యాలకు నిలయమైన విజయనగరం జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు భరోసా కల్పించాలని, వారికి సామాజిక న్యాయంతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. అట్రాసీటి కేసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ ప్రాంతంలో ఎస్సీల పట్ల వివక్షత కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఈ పరిస్థితి మారేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వారికి విద్య, వైద్యం అందేలా చూడాలని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ఎస్సీలకు రిజర్వేషన్‌ అమలు చేయాలని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను స్వయంగా గమనించాలని సూచించారు. ఆర్‌డీవో, డీఎస్‌పీ స్థాయి అధికారులు ఎస్సీ బాలురు వసతిగృహాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. అనంతరం కమిషన్‌ కార్యదర్శి చిన రాముడు మాట్లాడుతూ దళితుల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూములకు సంబంధించినవే వస్తున్నాయని చెప్పారు. ఆ సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాలని, లేని పక్షంలో కారణాలు సవివరంగా తెలియజేసి మార్గం చూపాలన్నారు. దీనిపై కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి స్పందిస్తూ 15 రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ జిల్లాలో అట్రాసిటీ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని, బాధితులకు న్యాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్‌, ఏఎస్‌పీ సౌమ్యలత, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావులు ఉన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:01 AM