పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
ABN , Publish Date - May 31 , 2025 | 12:12 AM
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు మంజూరు చేయడంతో పాటు యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు.
- యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలి
- కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు సకాలంలో అనుమతులు మంజూరు చేయడంతో పాటు యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ‘ఏ శాఖ వద్ద కూడా దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించి, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు, పెట్టుబడులు, వాటి ద్వారా కల్పించే ఉపాధి అవకాశాలపై నివేదిక ఇవ్వాలి.’ అని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా తక్కువ సంఖ్యలో రుణాలు మంజూరు చేయడంపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా విరివిగా రుణాలు అందజేయాలన్నారు. జిల్లాలో ఏపీఐఐసీకి ఇప్పటి వరకు 2400 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, వాటిలో కేవలం 300 ఎకరాలు మాత్రమే వినియోగించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ భూముల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మేనేజర్ జీఎం శ్రీధర్, ఏడీ రామకృష్ణ, విజయనగరం ఆర్డీవో సవరమ్మ తదితరులు పాల్గొన్నారు.