Time for transfers బదిలీలకు వేళాయే
ABN , Publish Date - May 17 , 2025 | 12:08 AM
Time for transfers ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు తాజాగా అవకాశం కల్పించింది. మార్గదర్శకాలు కూడా వెలువడ్డాయి. శుక్రవారం నుంచి జూన్ రెండో తేదీ వరకూ ఈ ప్రక్రియ జరగనుంది. గత ఏడాది సెప్టెంబరులో బదిలీల ప్రక్రియ నిర్వహించగా ఈసారి పాఠశాలల సెలవులు ముగిసేలోగా బదిలీలు పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది.
బదిలీలకు వేళాయే
సిద్ధమవుతున్న ఉద్యోగులు
జూన్ రెండో తేదీలోగా పూర్తి కానున్న ప్రక్రియ
నేతల వద్దకు క్యూ
విజయనగరం కలెక్టరేట్, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు తాజాగా అవకాశం కల్పించింది. మార్గదర్శకాలు కూడా వెలువడ్డాయి. శుక్రవారం నుంచి జూన్ రెండో తేదీ వరకూ ఈ ప్రక్రియ జరగనుంది. గత ఏడాది సెప్టెంబరులో బదిలీల ప్రక్రియ నిర్వహించగా ఈసారి పాఠశాలల సెలవులు ముగిసేలోగా బదిలీలు పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది. మే 31వ తేదీలోపు ఒకే స్టేషన్‌లో ఐదు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. వ్యక్తిగత విజ్ఞాపన మేరకు ఈ నిబంధనతో సంబందం లేకుండా బదిలీ చేయొచ్చు. 2026 మే 31 లోపు ఉద్యోగ విరమణ అయ్యే వారిని బదిలీ చేయరు. ఒక వేళ వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చు. పరిపాలన సౌలభ్యం కోసం కూడా బదిలీ చేసే అవకాశాన్ని కల్పించింది. అంధ ఉద్యోగులు, బుద్ధిమాంద్యం, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన వారు, 40 శాతం దివ్యాంగ ఉద్యోగులు, కారుణ్య నియాకమం ద్వారా ఉద్యోగం పొందిన వారికి బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలని జీవోలో పొందుపరిచారు. భార్యా, భర్త ఇద్దరూ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలి. వీలుకాకపోతే సమీప గ్రామంలోనే పోస్టింగ్ ఇవ్వాలి. సాధారణంగా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్ని రోజులు గడువు ఇచ్చినా చివరి రోజునే రెవెన్యూ తోపాటు చాలా శాఖల్లో బదిలీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి బదిలీలు ముందుగా పూర్తి చేస్తారా? చివరి రోజునే ప్రక్రియ పూర్తి చేస్తారా? అనేది అధికారులకే తెలియాలి.
విద్యాశాఖ మినహా మిగిలిన అన్ని శాఖల్లో ....
విద్యా శాఖ మినహా జిల్లాలోని 98 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఈ బదిలీలు వర్తించనున్నాయి. రెవెన్యూ, వైద్య, వ్యవసాయం, సంక్షేమ శాఖలు, ఖజానా, పంచాయతీరాజ్; గ్రామీణ నీటి సరఫరా విభాగం, హౌసింగ్, అటవీ, జడ్పీ, ఆర్‌ఆండ్‌బీ, మున్సిపల్, పోలీసు, పశు సంవర్ధక, పరిశ్రమలు, ఇరిగేషన్, వాణిజ్యం తదితర శాఖల్లో అర్హులైన వారు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నేతల వద్దకు అధికారులు
బదిలీలకు ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రజాప్రతినిఽధుల వద్దకు అధికారులు, సిబ్బంది క్యూ కడుతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పని చేసే వారంతా తమకు కావాల్సిన స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమకు కావాల్సిన ఉద్యోగులను తెచ్చుకోవడానికి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో ఎక్కువ మంది ఉద్యోగులు జిల్లా కేంద్రంలో కాకుండా మండల కేంద్రాలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈసారి ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలను పాటిస్తారా? లేక సిఫార్సులకు పెద్ద పీఠ వేస్తారా? అనేది చూడాలి.
---------------