Share News

Shiva శివ పూజకు వేళాయే!

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:42 PM

Time for Shiva Worship! అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావించే కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు జిల్లాలోని వివిధ శివాలయాల్లో భక్తులు పూజలు చేసేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా కార్తీకంలో నెల రోజుల పాటు శివాలయాలను భక్తులు దర్శించుకుంటారు. సోమవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

  Shiva  శివ పూజకు వేళాయే!

పార్వతీపురం/గరుగుబిల్లి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావించే కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు జిల్లాలోని వివిధ శివాలయాల్లో భక్తులు పూజలు చేసేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా కార్తీకంలో నెల రోజుల పాటు శివాలయాలను భక్తులు దర్శించుకుంటారు. సోమవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గుంప, అడ్డాపుశీల, సాలూరులోని పంచముఖేశ్వర ఆలయం, పాచిపెంట మండలంలోని మంచాడవలస గోకర్ణేశ్వర గుహాలయం, పారమ్మకొండ, తదితర చోట్ల కార్తీక పూజలకు సర్వం సిద్ధం చేశారు. పాలకొండ, భామిని, సీతంపేట, తదితర మండలాల్లో ఉన్న శివాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బారికేడ్లు సిద్ధం చేశారు. దీపావళి అమావాస్య తరువాత నుంచి మొదలయ్యే కార్తీకం శివకేశవులకు ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో చేసే స్నానాలు, దీపారాధనలు, ఉపవాస దీక్షలకు విశేషమైన ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత తలసి కోట వద్ద దీపాలను వెలిగిస్తూనే పరమేశ్వరుడిని పూజిస్తారు. విష్ణు సహస్రనామాలను భక్తులు పటిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో పరమేశ్వరుడికి చేసే అర్చనలు, అభిషేకాలు చేస్తుంటారు. స్వయంపాక దానాలు, వస్త్ర దానాలు చేసి అత్యంత పుణ్య ఫలమని భక్తజనం భావిస్తారు. మరికొందరు నేటి నుంచి అయ్యప్ప, శివ మాలల దీక్ష చేపట్టనున్నారు. మన్యంలో పిక్నిక్‌ల సందడి కూడా ప్రారంభం కానుంది.

Updated Date - Oct 21 , 2025 | 11:42 PM