తాళ్లు కట్టి.. మహిళలను గెడ్డ దాటించి
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:12 AM
మండలంలోని దుగ్గేరు ప్రాంతంలో గిరిజనులకు అడారి గెడ్డ కష్టాలు వీడడం లేదు.
- వర్షాలకు ఉప్పొంగిన అడారి గెడ్డ
- గిరిజనులకు తప్పని కష్టాలు
మక్కువ రూరల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుగ్గేరు ప్రాంతంలో గిరిజనులకు అడారి గెడ్డ కష్టాలు వీడడం లేదు. శనివారం ఉదయం గుంటభద్ర గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కూలి పనుల కోసం అడారి గెడ్డ కాజ్‌వేను దాటుకొని మార్కొండపుట్టి గ్రామానికి వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి వారి స్వగ్రామానికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే, అడారి గెడ్డ పరివాహక ప్రాంతంలో భారీవర్షం కురవడంతో గెడ్డలో వరద పొంగి ప్రవహించింది. కాజ్‌వే కూడా ముంపునకు గురైంది. దీంతో కూలి పనులకు వెళ్లిన మహిళలు తమ గ్రామానికి చేరుకోవడానికి వేరే మార్గంలేక ఇబ్బందులు పడ్డారు. వారిని గ్రామంలోకి తీసుకురావడానికి గుంటభద్ర గ్రామపెద్దలు పెద్ద ప్రయత్నమే చేశారు. గెడ్డకు ఇవతలి వైపుఉన్న ఓచెట్టుకు.. అవతలివైపు ఉన్న మరోచెట్టుకు బలమైన తాళ్లు కట్టారు. ఆ తాళ్ల సహాయంతో ఒక్కొక్క మహిళను ప్రమాదకర స్థితిలో నదిని దాటించి గ్రామానికి చేర్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దుగ్గేరు ప్రాంతంలో గత నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని గిరిజనులు వాపోతున్నారు. దుగ్గేరు ప్రాంత గిరిజనులు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే అడారి గెడ్డను దాటాల్సిందే. ప్రత్యామ్నాయంగా మరో మార్గం లేదు. వర్షా కాలంలో గెడ్డ అవతల భాగంలో నివాసముంటున్న 20 గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతుంటారు. అనుక్షణం ప్రాణభయంతో గెడ్డ దాటి ప్రయాణం సాగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమకు కష్టాలు తొలగడంలేదని అంటున్నారు. ఇప్పటికైనా గెడ్డపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
111111111111111111111