Share News

Tidco homes change? టిడ్కో గృహాల దశ మారేనా?

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:18 AM

Tidco homes change? బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలోని రామన్నదొరవలస సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు సమీపంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఇప్పటికైనా లబ్ధిదారుల చెంతకు చేరుతాయా? వారి సొంతంటి కల నెరువేరుతుందా? ప్రభుత్వం తొందరగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడైతే జవాబు దొరకడం లేదు.

 Tidco homes change? టిడ్కో గృహాల  దశ మారేనా?
రామన్నదొరవలసలోని టిడ్కో ఇళ్లు

టిడ్కో గృహాల

దశ మారేనా?

అప్పగించాలని కోరుతున్న లబ్ధిదారులు

రద్దయిన వారు డబ్బులు వాపస్‌ ఇవ్వాలని విన్నపం

ప్రభుత్వం వచ్చి ఏడాదైనా కదలిక లేని వైనం

బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలోని రామన్నదొరవలస సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు సమీపంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఇప్పటికైనా లబ్ధిదారుల చెంతకు చేరుతాయా? వారి సొంతంటి కల నెరువేరుతుందా? ప్రభుత్వం తొందరగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడైతే జవాబు దొరకడం లేదు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లలో ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయి. నిర్వహణ లేక గోడలు, తలుపులు, కిటికీలు చెదలు పట్టి పాడైన పరిస్థితి. లబ్ధిదారులైతే కూటమి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నారు.

బొబ్బిలి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలోని రామన్నదొరవలస సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు సమీపంలో 31.69 ఎకరాల్లో 2448 ఇళ్లను జీప్లస్‌ 5 ప్రాతిపదికన రూ.164.77 కోట్ల అంచనాతో ప్రారంభించారు. 2019 ఎన్నికల ముందు ఓ పండుగ వాతావరణంలో లబ్ధిదారులతో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. పనులు చురుగ్గా జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగింది. అధికారం చేపట్టిన వైసీపీ రాజకీయపరమైన ఆలోచనతో వీటిని విస్మరించింది. ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయి. వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ ఇళ్లకు పోటీగా జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణాలను ప్రారంభించింది. అటు టిడ్కో ఇళ్లను గాని, ఇటు జగనన్న ఇళ్ల కాలనీలను గాని వేటినీ పూర్తి చేయలేకపోయింది.

- వైసీపీ హయాంలో 2023లో టిడ్కో లబ్ధిదారులతో సమావేశం జరిపి ఇళ్లను అప్పగించేస్తాం తీసుకోండి అంటూ వైసీపీ నాయకులు హడావిడి చేశారు. పూర్తి కాకుండా ఇళ్లల్లోకి దిగేది లేదని లబ్ధిదారులంతా తెగేసి చెప్పేశారు. ఇంతలో మళ్లీ ఎన్నికలు రావడం ఈసారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిడం జరిగింది.

- నాడు మూడు కేటగిరీల్లో ఐదు అంతస్తుల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 300 ఎస్‌ఎఫ్‌టి సైజులో 1344 ఇళ్లు, 365 ఎస్‌ఎఫ్‌టి సైజులో 528 ఇళ్లు, 430 ఎస్‌ఎఫ్‌టి సైజులో 576 ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఒక్కో బ్లాకులో 48 ఇళ్లు చొప్పున ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో 25 శాతం లోపు నిర్మాణం జరిగిన ఇళ్లను పూర్తిగా నిలిపేశారు. మిగిలిన ఇళ్ల పనులను చివరి వరకు సాగదీశారు.

- 700 మంది త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు. వీరంతా 25 శాతం లోపు పనుల కేటగిరీలో రద్దయిపోయిన ఇళ్ల లబ్ధిదారులు. వీరికి చెల్లించాల్సిన డిపాజిట్‌ సొమ్ము విషయంలో వైసీపీ పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. వారిలో కొందరికి రూ.25వేలు, ఇంకొందరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష చెల్లించాల్సి(వాపస్‌) ఉంది.

- మెసర్స్‌ వీఎన్‌సీ, ఏజేఎంసీపీఎల్‌, ఆర్‌కెఐపీఎల్‌ అండ్‌ సింగాన్‌ జేవీ, వెల్కో ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థలకు టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు అప్పగించారు. కొద్ది నిర్మాణాలను పూర్తి చేసి రోడ్డు సౌకర్యం కల్పిస్తే టిడ్కో కాలనీ ఓ టౌన్‌షిప్‌గా మారుతుంది కానీ ఆ వైపులా చర్యలు లేవు.

- కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదు. ఈ సమస్యపై సోమవారం సీపీఎం నాయకులు ధర్నా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:18 AM