తుమ్మికాపల్లి కేజీబీవీ ఖాళీ
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:26 AM
మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అగ్ని ప్రమాదాలు జరగడంతో భయంతో విద్యార్థిను లంతా ఇళ్లకు వెళ్లిపోయారు.
-ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థినులు
- రెండోసారి అగ్నిప్రమాదం జరగడంతో..
-విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్
కొత్తవలస, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అగ్ని ప్రమాదాలు జరగడంతో భయంతో విద్యార్థిను లంతా ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో కేజీబీవీ ఖాళీ అయ్యింది. మంగళవారంరాత్రి కేజీబీవీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఆరో తరగతి విద్యార్థి ముమ్మన పూర్ణిమ, ఏడోతరగతి విద్యార్థిని కె.భూమిక ఆందోళన చెంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారిని పాఠ శాల సిబ్బంది కొత్తవలస పీహెచ్‌సీకి తరలించగా, వైద్యాధికారిణి సీతల్‌వర్మ చికిత్స అం దించారు. అగ్ని ప్రమాదాలతో భయాందోళనకు గురైన విద్యార్థినులు రాత్రికి రాత్రే పాఠశాలను వదిలి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 280 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో 279మంది విద్యార్థినులను మంగళవారం రాత్రి వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లిపో యారు. ఒకవిద్యార్థిని మాత్రం బుధవారం ఉదయం తన తల్లిదండ్రుల వెంట ఇంటికి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంగళవారం అర్ధరాత్రి12గంటల సమయంలో ఎమ్మెల్యే లలితకుమారి పరామర్శించారు. విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, డీఈ సురేష్ బాబు, ఇతర విద్యుత్ శాఖాధికారులు ప్రమాదం జరిగిన గదిని పరిశీలించారు. ఎక్కడా షార్టు సర్క్యూట్ జరిగినట్టుగా లేదని వారు అన్నారు. ప్రిన్సిపాల్ విజయకుమారి మాత్రం షార్ట్ సర్క్యూటే కారణమంటున్నారు. స్విచ్ బోర్డుల నుంచి పొగలు వచ్చాయని, ఆ సమయంలో తరగతి గదిలో విద్యార్థినులు ఎవరూ లేరని, వెంటనే అగ్నిమాపక శాఖాధికారికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం పాఠశాలకు వచ్చి పరిశీలించారు. విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడారు. రెండోసారి ప్రమాదం జరగక ముందు ఆ గదిలో ఉన్న అన్ని స్విచ్‌లు ఆపు చేశామని, షార్టు సర్క్యూట్ జరిగే అవకాశం లేదని ఎస్‌ఈ లక్ష్మణరావు కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థినులు తరగతి గదుల్లోనే చదువుకుని, అక్కడే భోజనాలు చేసి అక్కడే నిద్రపోతున్నట్టు తెలుసుకుని కొంత అసహనం వ్యక్తం చేశారు. అగ్నిమాపక, విద్యుత్‌శాఖ అధికారులు ఉమ్మడిగా ప్రమాదంపై ఆడిట్ చేసి నివేదికను బుధవారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థినులను మళ్లి స్కూల్‌కు తీసుకొచ్చి ఎప్పటిలాగనే పరిస్థితులు కల్పిస్తామని అన్నారు. పిల్లల రక్షణ బాధ్యత తమదని అన్నారు. తల్లితండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలందరినీ తిరిగి పాఠశాలకు పంపించాలని సూచించారు. గురువారం పేరెంట్ మీటింగ్ జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పాఠశాలను సందర్శించారు. అగ్నిప్రమాదం గురించి ప్రిన్సిపాల్ విజయకుమారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం ఆర్డీవో దాట్ల కీర్తి, జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, డీఎంహెచ్‌వో జీవన్‌రాణి, జిల్లా అగ్నిమాపక అధికారి రామ్‌కుమార్, ఎస్‌ఎస్ ఏఈఈ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.