Share News

In-charges! మూడేళ్లవుతున్నా.. ఇన్‌చార్జిలే దిక్కు!

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:00 AM

Three Years On… Still Dependent on In-charges! జిల్లా ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా.. ఇంకా కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇన్‌చార్జితోనే కాలం నెట్టుకొస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారే అనేక శాఖలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లా ప్రగతిపై కూడా ఆ ప్రభావం పడుతోంది.

  In-charges! మూడేళ్లవుతున్నా.. ఇన్‌చార్జిలే దిక్కు!
కలెక్టర్‌ కార్యాలయం

పొరుగు జిల్లాల వారికే అదనపు బాధ్యతలు

ప్రజలకు పూర్తిస్థాయిలో అందని సేవలు

జిల్లా ప్రగతిపై ప్రభావం

పోస్టుల భర్తీపై దృష్టి సారించని గత వైసీపీ సర్కారు

రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజల విన్నపం

పార్వతీపురం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా.. ఇంకా కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇన్‌చార్జితోనే కాలం నెట్టుకొస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారే అనేక శాఖలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లా ప్రగతిపై కూడా ఆ ప్రభావం పడుతోంది. ప్రధానంగా అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంతో హడావుడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతులు, కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకంపై దృష్టి సారించలేదు. దీంతో జిల్లాలో పాలనా వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

వివిధ శాఖల్లో పరిస్థితి ఇదీ..

జిల్లా విద్యాశాఖకు పూర్తిస్థాయి అధికారి లేరు. ఇన్‌చార్జి డీఈవోగా రాజ్‌కుమార్‌ కొనసాగుతున్నారు. బీసీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మన్యంలో పనిచేస్తున్న గడ్డెమ్మ శ్రీకాకుళంలో పూర్తిస్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఈడీగా ఉన్న వెంకటేశ్వరరావు కూడా విజయనగరంలో పూర్తిస్థాయి బాధ్యతలు చేపడుతున్నారు. క్రీడాశాఖ అధికారి వెంకటేశ్వరరావును ఇటీవల విజయనగరం బదిలీ చేశారు. అయితే తిరిగి ఆయన్నే జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించారు. విజయనగరం మెప్మా పీడీ చిట్టి రాజును జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించారు. శ్రీకాకుళం టూరిజం అధికారి నారాయణరావు, అదే జిల్లాకు చెందిన మత్స్యకార అధికారి సంతోష్‌కుమార్‌, సిక్కోలులో దివ్యాంగులు, వృద్ధుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కవిత తదితరులు ‘మన్యం’లో ఇన్‌చార్జి అధికారులుగా పనిచేస్తున్నారు.

- గృహ నిర్మాణశాఖకు పూర్తిస్థాయి జిల్లా అధికారి లేరు. ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఇంజనీర్లు కూడా లేరు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో హౌసింగ్‌ పీడీగా పనిచేసిన రఘురాంకు జిల్లా నుంచి బదిలీ జరిగి సుమారు రెండేళ్లు అయ్యింది. అయితే ఇంతవరకు ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఇన్‌చార్జి పీడీగా ప్రత్యేక ఉప కలెక్టర్‌ ధర్మాచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా ఈ శాఖలో డీఈలే కీలకంగా ఉన్నారు.

- జిల్లా సివిల్‌ సప్లైస్‌ అధికారి పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇన్‌చార్జి డీఎస్‌వోగా డీఆర్వో హేమలత కొనసాగుతున్నారు.

ఐటీడీఏల్లో ఇలా...

పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు కూడా పూర్తిస్థాయి పీవోలు లేరు. సబ్‌కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఇన్‌చార్జి పీవోలుగా కొనసాగుతున్నారు.

బదిలీల తర్వాత ఎలా?

ఉద్యోగుల బదిలీలు తర్వాత జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. మరికొన్ని శాఖల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని శాఖలకు చెందిన కొందరు అధికారులు జిల్లా నుంచి వెళ్లిపోయేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారు వెళ్లిపోతే తిరిగి ఆయా స్థానాలకు ఇతర జిల్లాల నుంచి అధికారులు వస్తారో.. రారో? తెలియని పరిస్థితి నెలకొంది.

Updated Date - Jun 07 , 2025 | 12:00 AM