Three of the best masters ఉత్తమ మాస్టార్లుగా ముగ్గురు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:08 AM
Three of the best masters రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలో ముగ్గురు ఎంపికయ్యారు. వీరు ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయులు నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలో వివిధ జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు.
ఉత్తమ మాస్టార్లుగా ముగ్గురు
రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక
ముగ్గురూ నెల్లిమర్ల నియోజకవర్గం వారే
5న విజయవాడలో పురస్కారం ప్రదానం
విజయనగరం కలెక్టరేట్/ నెల్లిమర్ల, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలో ముగ్గురు ఎంపికయ్యారు. వీరు ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయులు నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలో వివిధ జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు.
- నెల్లిమర్ల మండలం పారసాం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న సిద్ధాంతం త్రినాథరావు 1989లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. గణితం బోధనలో ప్రత్యేకతను చాటారు. విద్యార్థులు గణితం సబ్జెక్టును సులువుగా నేర్చుకోవడం కోసం 1200 పైగా వీడియోలు చేశారు. ఉపాధ్యాయలు తమ సబ్జెక్టుల్లో కంటెంట్ తయారు చేసుకునేలా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించారు. అలాగే విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్, ఐఐఐటిలో గత మూడు సంవత్సరాలుగా శిక్షణ ఇవ్వడంతో 16 మంది విద్యార్థులు ఐఐఐటికి ఎంపికయ్యారు. 25 మంది ఎన్‌ఎంఎంఎస్ ఉపకార వేతనాలు పొందారు. ఈ సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం త్రినాథరావుకు రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది.
- నెల్లిమర్ల మండలంలోని అలుగోలు జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన జీఎస్ కాంతారావు కూడా ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన గణితంలో పలు పుస్తకాలు, మాడ్యుల్స్ రాసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ఈఏడాది జూలై 30న ఉద్యోగ విరమణ చేశారు.
- భోగాపురం మండలం రావాడ జడ్పీ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.సూర్యనారాయణ కూడా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ఎందరో విద్యార్థులకు వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దారు. దాదాపు 268 మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో మంచి ప్రతిభ చూపించారు. ఈ అంశాల ఆధారంగా సూర్యనారాయణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.