ముక్కోటి ఏకాదశికి తోటపల్లిలో ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:59 PM
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గరుగుబిల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న ఏకాదశిని పురస్కరించుకుని పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత నెలకొనడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తుల తిరువీధి మహోత్సవం నిర్వహిస్తామన్నారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. తిరువీధికి సంబంధించి హనుమాత్ వాహనం సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయన్నారు. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని కోరారు.