Share News

అమెరికాలో చదువుతున్న వారు పేదలంట!

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:12 AM

గంట్యాడ మండలం మదనాపురం గ్రామ సర్పంచ్‌ జాగరపు అప్పారావు కుమార్తె ప్రియాంక మూడేళ్ల కిందట చదువు కోసం అమెరికా వెళ్లారు.

అమెరికాలో చదువుతున్న వారు పేదలంట!

- బంగారు కుటుంబాల జాబితాలో అనర్హులు

- విదేశాల్లో చదువుతున్న వారిపేర్లు నమోదు

- భూస్వాములు, ధనవంతుల పేర్లు కూడా..

- తొలగిస్తామంటున్న ప్రణాళిక అధికారి

- గంట్యాడ మండలం మదనాపురం గ్రామ సర్పంచ్‌ జాగరపు అప్పారావు కుమార్తె ప్రియాంక మూడేళ్ల కిందట చదువు కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంగారు కుటుంబం జాబితాలో ప్రియాంక పేరు ఉంది. అలాగే ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రంధి చినరామునాయుడు భార్య సరోజిని పేరు కూడా బంగారు కుటుంబ జాబితాలో ఉంది. చినరామునాయుడు భూస్వామి. ఈ ఇద్దరి పేర్లే కాకుండా గ్రామంలో మరికొంత మంది భూస్వాములుతో పాటు ఆర్థికంగా ఉన్నవారి పేర్లు కూడా బంగారు కుటుంబ జాబితాలో కనిపిస్తున్నాయి. ఆయా కుటుంబాలను స్థానిక అధికారులకు తెలియకుండా ఆన్‌లైన్‌లో దత్తత తీసుకున్నట్లు ఉండటం విశేషం. గ్రామంలోని 79 కుటుంబాలు బంగారు కుంటుంబం జాబితాలో ఉన్నాయని, కానీ, ఇందులో 11 కుటుంబాలు మాత్రమే అసలైనవని ఓ అధికారి చెబుతున్నారు. తాము గతంలో సర్వే చేసి ఇచ్చిన జాబితాకు, ఇప్పుడు జాబితాకు తేడా ఉందని ఆ అధికారి అంటున్నారు.

- ఎస్‌.కోట మండలం ముషిడిపల్లి గ్రామ పరిధిలో 27 కుటుంబాలు బంగారు కుటుంబ జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో గార కృష్ణ కుటుంబానికి మాత్రమే అర్హత ఉంది. మిగిలిన కుటుంబాలు ఆ జాబితాలోకి రావని క్షేత్రస్థాయి అధికారి వెల్లడిస్తున్నారు.

గంట్యాడ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఈ రెండు గ్రామాల్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. ఎంపిక చేసిన బంగారు కుంటుంబాల జాబితాలో చాలా వరకూ భూస్వాములు, ధనవంతులు, విదేశాల్లో చదువుతున్న వారి పేర్లు ఉన్నాయి. గతంలో సచివాలయ సిబ్బంది నిర్వహించిన సర్వేకు, ఇప్పుడు ప్రభుత్వ ఆన్‌లైన్‌ జాబితాకు చాలా తేడా ఉంది. అట్టడుగున ఉన్న నిరుపేదలకు చేయూతనందించి వారికి ఆర్థికంగా ఓ దారి చూపాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు ‘బంగారు కుటుంబాలు- మార్గదర్శకులు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా.. వారిని దత్తత తీసుకొని సాయం చేసేవారిని మార్గదర్శకులుగా అభివర్ణిస్తూ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యుత్‌ మీటరు, గ్యాస్‌ కనెక్షన్‌, బ్యాంకు అకౌంట్‌ లేనివారు, 30 మీటర్ల దూరంలో మంచి నీటి సదుపాయం లేనివారు, జీవనోసాధి అవకాశం లేనివారి కుటుంబాలను మాత్రమే బంగారు కుటుంబాల కోసం ఎంపిక చేయాలి. అయితే, జిల్లాలో గుర్తించిన 67 వేల బంగారు కుటుంబాల్లో చాలా వరకూ అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రామ సచివాలయాలకు వచ్చిన జాబితాలో చాలా వరకూ తేడాలు ఉన్నాయంటూ సచివాలయ కార్యదర్శులు వాపోతున్నారు. మార్గదర్శకులుగా కావాల్సిన వారు బంగారు కుటుంబాల జాబితాలో ఉండటంపై వారు ఆశ్చర్యపోతున్నారు. 67వేల కుటుంబాల్లో ఇప్పటి వరకు 29 వేలు కుటుంబాలను ఆన్‌లైన్‌లో దత్తత తీసుకున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ వద్ద ప్రస్తావించగా.. బంగారు కుటుంబాల జాబితాలో విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, భూస్వాములు, ధనవంతుల పేర్లు ఉంటే వాటిని మార్పు చేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Aug 09 , 2025 | 12:12 AM