Lands ఆ భూములు మావే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:29 AM
Those Lands Are Ours ఏకలవ్య పాఠశాలకు కేటాయించిన స్థలం తమదేనని ఆదివాసీ గిరిజనులు బుధవారం మూకమ్మడిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం 16 మంది కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ కర్రలు పాతి పూజలు చేశారు.

న్యాయం చేయాలని డిమాండ్
భామిని, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఏకలవ్య పాఠశాలకు కేటాయించిన స్థలం తమదేనని ఆదివాసీ గిరిజనులు బుధవారం మూకమ్మడిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం 16 మంది కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ కర్రలు పాతి పూజలు చేశారు. ఆ భూములను గతంలో తమ పూర్వీకులు సాగు చేసేవారని తెలిపారు. ఏకలవ్య కోసం తమ వద్ద నుంచి కొంత భూమిని తీసుకున్నా.. పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని వెల్లడించారు. గతంలో ఐటీడీఏ అధికారులు ఇచ్చిన హామీ మేరకుఇళ్ల స్థలాలు, మిగులు భూములు కేటాయించే వరకు ఆందోళన సాగిస్తామన్నారు. ఏకలవ్య పాఠశాల ప్రహరీ నిర్మాణం పూర్తయితే తమకు న్యాయం జరగదని ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడ్డామని తెలిపారు. కాగా తహసీల్దార్ ఎన్.అప్పారావు, రెవెన్యూ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆదివాసీలతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్ రెడ్డికి తెలియజేశారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయానికి గురువారం వారిని పంపించాలని పీవో సూచించడంతో ఆదివాసీ గిరిజనులు శాంతించారు. వాస్తవంగా 2018లో భామిని మండలానికి ఏకలవ్య పాఠశాలను మంజూరు చేయగా స్థల సమస్య ఎదురైంది. ఈ క్రమంలో 336 సర్వేలో ఆదివాసీలు సాగు చేస్తున్న 32 ఎకరాలలో సగం పాఠశాలకు ఇవ్వాలని అప్పట్లో ఆదివాసీలను అధికారులు ఒప్పించారు. ఈ మేరకు 16 మందికి ఎకరా స్థలంతో పాటు మిగులు భూమిలో పట్టా , ఇళ్లు స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ఆదివాసీలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగారు.