ఆ ఐదు కిలోమీటర్లు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:02 AM
రాజాం-విశాఖ ప్రధాన మార్గంలోని సుమారు ఐదు కిలోమీటర్ల రహదారి నరకానికి నకళ్లుగా మారింది.
- ప్రయాణం నరకం
- విస్తరణకు నోచుకోని కొత్తవలస జంక్షన్ -ఉల్లివలసమెట్ట రోడ్డు
- రెండేళ్ల కిందట రూ.3.30 కోట్లు మంజూరు
- పనులు చేపట్టడంలో వైసీపీ నిర్లక్ష్యం
- వెనక్కి మళ్లిన నిధులు
- ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
రాజాం రూరల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాజాం-విశాఖ ప్రధాన మార్గంలోని సుమారు ఐదు కిలోమీటర్ల రహదారి నరకానికి నకళ్లుగా మారింది. రాళ్లు, గోతులతో దారుణంగా తయారైంది. ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుని ఎందరో ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. దీనిపై ప్రయాణమంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. రాజాం మండల పరిధిలోని కొత్తవలస జంక్షన్ నుంచి ఉల్లివలస మెట్ట వరకూ 9 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ, మరమ్మతుల కోసం గత వైసీపీ ప్రభుత్వం రూ.3.30 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ పనులను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. కానీ, పనులు మాత్రం ప్రారంభించలేదు. కాంట్రాక్టర్‌తో పనులు చేయించడంలో అప్పటి వైసీపీ నాయకులు, అధికారులు విఫలమయ్యారు. దీంతో నిధులు వెనక్కి మళ్లాయి. ఫలితంగా రహదారి దారుణంగా తయారవుతోంది. కొత్తవలస జంక్షన్ నుంచి ఇప్పిలిపేట వరకూ ఐదు కిలోమీటర్లు కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా మారింది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వెయ్యికి పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పాలకొండ, విజయనగరం, రాజాం ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుం టారు. రాజాంలో వివిధ విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఉండడంతో చీపురుపల్లి, గరివిడి తదితర ప్రాంతాల నుంచి రాజాం పట్టణానికి ప్రజలు వస్తుంటారు. వీరంతా ఈ రోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలో మంజూరైన నిధులు మురిగిపోయినా, తాజాగా రహదారి విస్తరణపై పాలకులు, అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
పనులు పూర్తిచేయాలి
గత ఐదేళ్లుగా గతుకుల రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాం. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా యి. రాత్రివేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. కొత్తగా ఈమార్గంలో ప్రయాణించే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా రహదారి విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేయాలి.
-బట్న రమణ, పెనుబాక
గత ప్రభుత్వ తప్పిదమే
గత వైసీపీ ప్రభుత్వ తప్పిదం మాకు శాపంగా మారింది. అప్పట్లో రూ.3.30 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పనులు చేయించడంలో అప్పటి వైసీపీ నాయకులు, అధికారులు చొరవ చూపలేదు. దీంతో ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇప్పటికైనా రహదారి విస్తరణ పనులు చేపట్టాలి.
-శంకరరావు, బొద్దాం
రూ.4 కోట్లు అవసరం
గతంలో మంజూరైన నిధులు వెనక్కి మళ్లాయి. రహదారి విస్తరణ, ఇతర పనులకు తాజా లెక్కల ప్రకారం రూ.4 కోట్లు అవసరమని అంచనా వేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన, ఆర్థికపరమైన ఆమోదం లభించి, నిధులు మంజూరైతే యుద్ధ ప్రాతిపదికన విస్తరణ పనులు ప్రారంభిస్తాం.
-నాగభూషణరావు, ఏఈ, ఆర్‌అండ్‌బీ, రాజాం