ఆ కౌన్సిలర్లు గైర్హాజరు
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:26 AM
Those councilors are absent

ఆ కౌన్సిలర్లు గైర్హాజరు
శంబంగి నిర్వహించిన సమావేశానికి హాజరు కాని వైనం
మునిసిపాల్టీలో అవిశ్వాస తీర్మానంపై సర్వత్రా పెరిగిన అనుమానాలు
బొబ్బిలి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు సన్నద్ధమవుతున్న తరుణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు గురువారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా రహస్య సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి సగం మంది సొంతపార్టీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తొమ్మిది మంది శంబంగి నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదు. ఈ నెల 17 కల్లా మున్సిపల్ పాలకవర్గానికి నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. 18 తర్వాత అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇవ్వొచ్చు. బొబ్బిలి మున్సిపాలిటీలో ఇందుకోసం జోరుగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో శంబంగి నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. గైర్హాజరైన తొమ్మిది మంది శంబంగికి సంజాయిషీ ఇచ్చినట్లు తెలిసింది. కొంతమంది ఇంటికి వచ్చి స్వయంగా కలుస్తామని, ఇంకొంతమంది ఆరోగ్య సమస్యలున్నాయని, అర్జంటుగా క్యాంపులు వెళ్లామని చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏమిటో బయటపడిన తరువాత అవసరమైన నిర్ణయాలు తీసుకుందామని చైర్మన్, ఇతర కౌన్సిలర్లకు శంబంగి నచ్చజెప్పినట్లు తెలిసింది.
------------