Those Allegations ఆ ఆరోపణలు అవాస్తవం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:28 PM
Those Allegations Are Baseless మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నామని, ఫోరెన్సిక్, సాంకేతికత సహాయంతో దర్యాప్తు నిర్వహించామని వెల్లడించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు తేలిందని, తప్పుడు ఆరోపణలు చేసిన మహిళతోపాటు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.
సదరు మహిళతో పాటు ఆమె స్నేహితుడు అరెస్ట్
ఫేక్ మెసేజ్‌లు, స్ర్కీన్‌షాట్స్ సృష్టించారు..
ఫోరెన్సిక్ నివేదికలో తేలిన వైనం
చాలెంజింగ్‌గా తీసుకుని కేసును దర్యాప్తు చేశాం
ఎస్పీ మాధవరెడ్డి వెల్లడి
పార్వతీపురం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నామని, ఫోరెన్సిక్, సాంకేతికత సహాయంతో దర్యాప్తు నిర్వహించామని వెల్లడించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు తేలిందని, తప్పుడు ఆరోపణలు చేసిన మహిళతోపాటు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత నెలలో సాలూరు పట్టణానికి చెందిన బి.త్రివేణి అనే మహిళ.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద పీఏగా పనిచేసిన సతీష్, మంత్రి కుమారుడిపైన ఫిర్యాదు చేశారు. మరోవైపు టీడీపీ నాయకులు సైతం త్రివేణిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేశాం. త్రివేణితో పాటు ఆమె స్నేహితుడు మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దేవీప్రసాద్ ఉద్దేశం పూర్వకంగానే ఇదంతా చేసినట్లు రుజువైంది. సదరు మహిళ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఫేక్ ఎస్‌ఎంఎస్‌లు, ప్రొఫైల్స్ తయారు చేసినట్లు ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలింది. మంత్రి కుమారుడు, పీఏపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళ, ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశాం.’ అని తెలిపారు.
జరిగింది ఇదీ..
‘త్రివేణి భర్త 2021లో చనిపోయారు. ఆ తర్వాత సతీష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ఆమె దగ్గర సతీష్ డబ్బులు కూడా తీసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆ నగదు మొత్తం తిరిగి చెల్లించే నిమిత్తం త్రివేణి సోదరుడి పేరిట సతీష్ ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. సదరు మహిళలకు ఆఫీస్ సబార్డినేటర్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత బొబ్బిలి బదిలీ అయింది. ఆ తర్వాత ఆమె కోర్టుకు వెళ్లిన తర్వాత సాలూరులో పోస్టింగ్ వచ్చింది. 2023లో త్రివేణికి సాలూరు మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దేవీ ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. కాగా సతీష్ 2024లో మంత్రి సంధ్యారాణి వద్ద పీఏగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పేరు చెప్పి సదరు మహిళతో పాటు ఆమె స్నేహితుడు విధులు నిర్వహించకుండా ఆధిపత్యం చెలాయించేవారు. ఈ విషయం తెలుసుకున్న సతీష్.. వారిద్దర్నీ ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దీంతో సతీష్‌పై కక్ష పెంచుకున్న సదరు మహిళతో పాటు ఆమె స్నేహితుడు మంత్రి కుమారుడు, పీఏపై అసత్య ఆరోపణలు చేశారు. మంత్రి అండతో సతీష్ బదిలీ చేయించారని, అదే విధంగా మంత్రి కుమారుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు వద్దకు వెళ్లాలని వేధిస్తున్నాడని, ఈ మేరకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించారని త్రివేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళపై సతీష్ కూడా ఫిర్యాదు చేయడంతో సాంకేతిక సహకారంతో దర్యాప్తు నిర్వహించాం. త్రివేణి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలింది. ఎస్‌ఎంఎస్‌లు ఎక్కడ క్రియేట్ అయ్యాయి.. ఏ ఫోన్ నుంచి వచ్చాయో తెలుసుకున్నాం. పూర్తిగా ఆధారాలు సేకరించాం. ఫేక్ స్ర్కీన్‌షాట్స్‌ను మీడియాకు చూపించి వారు దారుణంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా త్రివేణి ఇంటికి వెళ్లి దూషించిన సతీష్‌పై చార్జిషీట్ నమోదు చేశాం.’ అని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ మనీషా వంగలరెడ్డి, సీఐ అప్పలనాయుడు ఉన్నారు.
నిందితులకు పది రోజుల రిమాండ్
సాలూరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మంత్రి కుమారుడు, పీఏపై తప్పుడు ఆరోపణలు చేసిన త్రివేణి, ఆమె స్నేహితుడు దేవీప్రసాద్‌ను మంగళవారం సాలూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయాధికారి హర్షవర్దన్ వారికి పది రోజుల పాటు రిమాండ్ విధించారు. నిందితులను బొబ్బిలి సబ్‌జైలుకు తరలించారు.