Share News

పకడ్బందీగా భూ రీసర్వే

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:24 PM

జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా భూ రీసర్వే
మాట్లాడుతున్న జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

- జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండో విడత రీసర్వే కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్‌ఏలతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని జిరాయితీగా మార్చే అవకాశం లేదన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరు మీద భూమి ఉంటుందో, పట్టాలో కూడా అదే పేరు ఉండేలా చూడాలన్నారు. పాత రికార్డులు, కొత్త డిజిటల్‌ మ్యాపింగ్‌ వివరాలు సరితూగేలా చేసి ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 22ఏలో పేరు ఉన్న వారికి ఎటువంటి పట్టాదారు హక్కు రాదన్నారు. ప్రభుత్వ భూమి ఎస్‌ఎఫ్‌ఐలో ఉంటే జిరాయితీలోకి మారే అవకాశం లేదన్నారు. గతంలో పాలకొండ డివిజన్‌లో అడివి అనే క్లాసిఫికేషన్‌లో సుమారు 18 ఎకరాలు భూమి ఉండేదని, దానిని సబ్‌ డివిజన్‌ చేశారని, దానిలో డీ-పట్టాలు, జిరాయితీ, కొన్నిపోరంబోకు ఉన్నాయని అన్నారు. గత 12 సంవత్సరాల నుంచి ఆ భూముల్లో ఉంటున్నామని నిరూపిస్తే కలెక్టర్‌ ఆర్డర్స్‌ ఇస్తారన్నారు. అప్పుడే 22ఏ నుంచి తొలగించవచ్చునని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారి లక్ష్మణరావు, పార్వతీపురం డీఐఓఎస్‌ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:24 PM