ఇదో రకం దందా!
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:12 AM
ఇసుక అక్రమార్కులు కొత్త దందాకు తెరతీశారు. నదుల్లో సేకరించిన ఇసుకతో సముద్రపు ఇసుకను కలిపి విక్రయిస్తున్నారు.
- నదుల్లో సేకరించి ఇసుకతో సముద్రపు ఇసుక మిక్సింగ్
- జిల్లాలో యథేచ్ఛగా చలామణి
- ఆందోళనలో గృహ నిర్మాణదారులు
రాజాం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమార్కులు కొత్త దందాకు తెరతీశారు. నదుల్లో సేకరించిన ఇసుకతో సముద్రపు ఇసుకను కలిపి విక్రయిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తెలియని నిర్మాణదారులు ఆ ఇసుకను వినియోగించి భవనాలు కడుతున్నారు. దీనివల్ల భవనాలు కొద్ది కాలానికే పటుత్వం కోల్పోతాయని నిర్మాణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించడంతో గృహ నిర్మాణంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంది. దీంతో నగరాలు, పట్టణాల్లో ఇసుక అవసరాలు పెరిగాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నదులు, కాలువల్లో ఇసుక లభ్యత లేదు. దీంతో అక్రమార్కుల కన్ను సముద్రపు ఇసుకపై పడింది. ఈ ఇసుకను నదుల్లో సేకరించిన ఇసుకతో కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. సముద్రపు ఇసుక అయితే ప్రభుత్వానికి ఎటువంటి చెల్లింపులు చేయనక్కర్లేదు. కావాలసినంత దొరుకుతుంది. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత అన్నమాట. ముఖ్యంగా జిల్లాకు దగ్గర ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం తీర ప్రాంతాలతో పాటు పూసపాటిరేగ, భోగాపురం మండలాల నుంచి సముద్రపు ఇసుకను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో విజయనగరం, రాజాం, బొబ్బిలి తదితర పట్టణాలకు ఎక్కువగా ఇసుక వస్తోంది. లారీ ఇసుక ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ పలుకుతోంది. ప్రస్తుతం అంతటా గృహ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కొన్ని రహదారుల నిర్మాణానికి సైతం ఇదే ఇసుకను వాడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
నిర్మాణాలకు వినియోగంచరు..
సముద్రపు ఇసుకను గృహ నిర్మాణానికి వినియోగించరు. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. దీన్ని సిమెంట్‌లో మిళితం చేస్తే ఎక్కువగా నీరుగారిపోతుంది. ఒక వేళ వాడాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఆ ఇసుకను మంచి నీటితో శుద్ధి చేయాలి. కానీ అది చాలా కష్టతరమైన పని. సముద్రపు ఇసుక రేణువులు చాలా సన్నగా ఉంటాయి. దాన్ని సిమెంట్‌తో కలిపితే అది సులువుగా మిశ్రమం అవ్వదు. నిర్మాణం కూడా బలంగా ఉండదు. పటుత్వం కోల్పోతుంది. అందుకే సముద్రపు ఇసుకతో నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిపుణులు అంగీకరించరు. కానీ, అక్రమార్జనకు అలవాటుపడిన వారు సముద్రపు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిర్మాణరంగాన్ని ప్రమాదంలో నెడుతున్నారు.
ప్రమాదకరం
సముద్రపు ఇసుకను వినియోగించి నిర్మాణాలు చేపట్టడం చాలా ప్రమాదకరం. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. దానిలో అస్సలు పటుత్వం ఉండదు. నిర్మాణం చేపట్టిన కొద్దికాలనీకే అది కూలిపోతుంది. అందుకే నిర్మాణదారులు ఇసుకను తెప్పించేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించడం ఉత్తమం.
-ఈశ్వరరావు, ఇంజనీరింగ్ నిపుణుడు, రాజాం