this is farmer welfare government రైతు సంక్షేమ ప్రభుత్వమిది
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:31 AM
this is farmer welfare government రైతులకు మంచి రోజులు వచ్చాయని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లాలోని 2.27లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎంకిసాన్ పథకాల కింద రూ.152.45కోట్లను ఆమె శనివారం విడుదల చేశారు.
రైతు సంక్షేమ ప్రభుత్వమిది
పంట చేతికొచ్చేవరకూ సహకారం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద నిధులు విడుదల
గజపతినగరం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతులకు మంచి రోజులు వచ్చాయని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లాలోని 2.27లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎంకిసాన్ పథకాల కింద రూ.152.45కోట్లను ఆమె శనివారం విడుదల చేశారు. ఈసందర్భంగా గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. విత్తనం నాటి నుంచి పంట ఇంటికి చేర్చేవరకు రైతులకు అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని పెంచేందుకు ముందుకు రావాలని కోరారు. భూముల రీసర్వేలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక సెల్‌ను, ట్రోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, పీఎంకిసాన్ పథకాల కింద జిల్లాలో 2లక్షల 27వేల 700మంది రైతులకు రూ.152.45కోట్లను పెట్టుబడి సాయం కింద అందజేస్తోందన్నారు. సాంకేతిక కారణాలతో ఎవరికైనా పథకం వర్తించకపోతే గ్రామంలోని రైతుసేవాకేంద్రాలను సంప్రదించాలని సూచించారు. తల్లికి వందనం పథకం కింద కొంతమంది పిల్లలకు సాంకేతిక కారణాలతో డబ్బులు పడలేదని, రెండు వారాల్లో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ప్రత్యేక ఉపకలెక్టర్ ప్రమీలగాంధీ, ఆర్డీవో మోహనరావు, జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు, గజపతినరగం ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రెడ్డి పావని, జనసేన నాయకుడు మర్రాపు సురేష్, మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
వరి నాట్లు వేసిన మంత్రి అనిత
గజపతినగరం, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): అన్నదాత సఖీభవ-పీఎంకిసాన్ పథకాల కింద రైతులకు సాయం విడుదల చేసేందుకు జిల్లాకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత రైతుల సమస్యలను తెలుసుకొనేందుకు పురిటిపెంట గ్రామంలో స్వయంగా పంట పొలంలోకి దిగారు. రైతు కూలీలతో కలివిడిగా మాట్లాడారు. అనంతరం వారితో కలిసి నాట్లు వేశారు. మోకాలి లోతులో కూరుకుపోయిన దమ్ముమడిలో మంత్రి దిగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.