Thieves in Chipurupalli చీపురుపల్లిలో దొంగల బీభత్సం
ABN , Publish Date - May 24 , 2025 | 11:52 PM
Thieves in Chipurupalli చీపురుపల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళల్ని తీవ్రంగా గాయపరిచి దొంగతనానికి పాల్పడ్డారు. మహిళల వంటిపై ఉన్న సుమారు 20 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు.
చీపురుపల్లిలో దొంగల బీభత్సం
అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు
ఇద్దరు మహిళలపై దాడి
20 తులాల బంగారం చోరీ
చీపురుపల్లి, మే 24(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళల్ని తీవ్రంగా గాయపరిచి దొంగతనానికి పాల్పడ్డారు. మహిళల వంటిపై ఉన్న సుమారు 20 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఆర్వోబీకి సమీపంలో నివాసం ఉన్న సురేష్, తన భార్య పిల్లలతో కలిసి సరస్వతీ పుస్కరాలకు వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో దొంగలు పడ్డారు. దుండగులు ఇంటి పక్కనున్న మేడ పైనుంచి సురేష్ ఇంట్లోకి ప్రవేశించారు. మేడ పైభాగంలోకి చేరుకొని పైనున్న తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి నుంచి కింది అంతస్తులోకి చేరుకున్నారు. బెడ్ రూంలోకి ప్రవేశించి బీరువా తలుపులు తెరిచి, వస్తువులన్నీ చిందరవందర చేశారు. ఆ గదిలో నిద్రిస్తున్న సురేష్ తల్లి వారణాసి కస్తూరి, అత్త చిట్టెమ్మల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. ఈ క్రమంలో వస్తువులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరినీ పదునైన ఆయుధంతో గాయపరిచి వస్తువులతో పరారయ్యారు. శనివారం ఉదయాన్నే సమాచారం తెలుసుకున్న వారి సమీప బంధువులు ఇంటికి వచ్చి, గాయపడిన వారిని ప్రథమ చికిత్సకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తీసుకెళ్లారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
దొంగతనం సమాచారాన్ని తెలుసుకున్న చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు, ఎస్‌ఐ ఎల్.దామోదరరావు శనివారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు దుండగులు ఇంట్లో కారం పొడి జల్లారు.