Share News

Mock Assembly మాక్‌ అసెంబ్లీలో అదరగొట్టారు

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:27 AM

They Rocked the Mock Assembly అమరావతిలో బుధవారం నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో మన్యం విద్యార్థులు అదరగొట్టారు. తమ ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు.

 Mock Assembly మాక్‌ అసెంబ్లీలో అదరగొట్టారు
స్పీకర్‌ పోడియం వద్ద ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలుగా మన్యం విద్యార్థులు

  • ప్రసంగాలతో ఆకట్టుకున్న వైనం

  • సీఎం, మంత్రులతో ప్రత్యేక ఫొటో సెషన్‌

పాలకొండ, నవంబరు, 26 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో బుధవారం నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో మన్యం విద్యార్థులు అదరగొట్టారు. తమ ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ మాక్‌ అసెంబ్లీలో సీఎంగా జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్‌, ప్రధాన ప్రతిపక్ష నేతగా సౌమ్య వ్యవహరించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించి.. సమాధానాలు రాబట్టుకునే తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి 175 మంది విద్యార్థులు మాక్‌ అసెంబ్లీకి హాజరయ్యారు. వీరంతా ప్రజాప్రతినిధుల పాత్రలను చక్కగా పోషించారు. పాలకొండ మండలం ఎం.సింగుపురం జడ్పీ హెచ్‌ఎస్‌కు చెందిన నిహారిక ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్ర పోషించగా, గరుగుబిల్లి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి దాసరి దినేష్‌ రూలింగ్‌ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. బలిజిపేట కేజీబీవీ విద్యార్థిని దువ్వు జయంతి హోం మినిస్టర్‌ హోదాలో మెరిశారు. ఇలా మన్యం విద్యార్థులు మాక్‌ అసెంబ్లీలో తమదైన శైలిలో ప్రతిభ చూపారు. ‘ మాక్‌ అసెంబ్లీకి హాజరవడం మరిచిపోలేని అనుభూతి. భారత రాజ్యాంగంపై మరింత గౌరవం పెరిగింది. రాజ్యాంగం విలువలు, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల బాధ్యతలు తెలుసుకున్నాం. భవిష్యత్‌లో ప్రజలకు మా వంతు సేవలందిస్తాం.’ అని పలువురు విద్యార్థులు తెలిపారు.

వాడీవేడిగా చర్చ...

మాక్‌ అసెంబ్లీలో పర్యావరణ పరిరక్షణ బిల్లు, క్రీడలపై విద్యార్థుల మధ్య వాడీవేడిగా చర్చ కొనసాగింది. ఒక దశలో ప్రతిపక్ష హోదాలో ఉన్నవారు స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ సమయంలో కొందరిని మార్షల్స్‌ ఎత్తుకొని అసెంబ్లీ హాల్‌ నుంచి బయటకు తీసు కెళ్లారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు పోలినట్టే ఈ కార్యక్రమం అంతా జరిగింది. శాసనసభలో కొంతమంది ప్రజా ప్రతినిధులు ప్రవర్తించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. అనంతరం సీఎం, మంత్రులతో విద్యార్థులకు ప్రత్యేక ఫొటో సెషన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణి, అనిత తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా నుంచి మాక్‌ అసెంబ్లీకి హాజరైన విద్యార్థులతో ఉన్న టీచర్లు పి.శ్రీరాంసాయి, ఎస్‌.సుబ్బలక్ష్మిని డీఈవో రాజ్‌కుమార్‌, ఏవో జోగినాయుడుతో అభినందించారు.

Updated Date - Nov 27 , 2025 | 12:27 AM