Share News

మా అబ్బాయిని చంపి బావిలో పడేశారు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:21 AM

తమ కుమారుడు ఎలకల రామును హత్య చేసి, నేలబావిలో పడేశారని పత్తికాయవలసకు చెందిన ఎలకల రమేష్‌, సింహాచలం అనే దంపతులు ఆరోపించారు.

మా అబ్బాయిని చంపి బావిలో పడేశారు

చీపురుపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తమ కుమారుడు ఎలకల రామును హత్య చేసి, నేలబావిలో పడేశారని పత్తికాయవలసకు చెందిన ఎలకల రమేష్‌, సింహాచలం అనే దంపతులు ఆరోపించారు. ఇటీవల పుర్రేయవలస సమీపంలో ఇటుక బట్టీ వద్ద నేలబావిలో రాము మృతదేహం తేలియాడింది. ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు. తమ కుమారుడు రాము.. ఓ ఎక్స్‌కవేటర్‌ యజమాని వద్ద నాలుగేళ్ల నుంచి డ్రైవర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. ఎప్పటిలాగే రాము ఈనెల 8న ఉదయాన్నే ఇటుక బట్టీ వద్దకు విధుల కోసం హాజరయ్యాడన్నారు. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి రావాల్సి ఉండగా రాలేదన్నారు. ఎక్స్‌కవేటర్‌ యజమానిని వాకబు చేయగా, రాము బాతువ వెళ్లినట్టు చెప్పార న్నారు. ఆ మరుసటి రోజు ఈనెల 9న ఉదయాన్నే ఎక్స్‌కవేటర్‌ యజమాని తమకు చెప్పకుండా గ్రామంలోని వేరే వ్యక్తికి ఫోన్‌ చేసి రాము కనిపించడం లేదని, అతడు వినియోగించే ద్విచక్ర వాహనం ఇటుక బట్టీ వద్ద ఉందని సమాచారం ఇచ్చారన్నారు. అయితే తాము అడిగే ప్రశ్నలకు ఆయన పొంతన లేని సమాధానం ఇస్తున్నారన్నారు. తమ కుమారుణ్ణి ఆయనే చంపి, నేల బావిలో పడవేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేస్తున్నామని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Updated Date - Oct 14 , 2025 | 12:21 AM