చంపేసి.. ఆభరణాలను దోచుకెళ్లి
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:51 PM
మండలంలోని లింగాలవలస సమీప ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న ముడసర్ల అప్పయ్యమ్మ(70) అనే వృద్ధురాలు శుక్రవారం రాత్రి హత్యకు గురైంది.
- లింగాలవలస ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వృద్ధురాలి హత్య
- ఐదు తులాల బంగారం అపహరణ
- మృతదేహాన్ని ఇంటి సమీప తుప్పల్లో పడేసిన వైనం
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భోగాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లింగాలవలస సమీప ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న ముడసర్ల అప్పయ్యమ్మ(70) అనే వృద్ధురాలు శుక్రవారం రాత్రి హత్యకు గురైంది. దుండగులు ఆమెను చంపేసి ఒంటిపై ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు, కుటుంబీకులు అందించిన వివరాల ప్రకారం.. అప్పయ్యమ్మ భర్త అప్పన్న కొంతకాలం కిందట మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులు తమ కుటుంబాలతో వేర్వేరుగా నివాసముండగా, అప్పయ్యమ్మ ఒంటరిగా రేకుల షెడ్డులో ఉంటుంది. పెద్ద కుమారుడు అమలాపురంలో కొబ్బరికాయలు తీసే పనికి వెళ్లగా, ఇంటి దగ్గర పెద్దకోడలు, మనువడు గౌరి ఉంటున్నారు. చిన్నకుమారుడు సూరప్పన్న.. భవానిమాల వేయడంతో దీక్ష విరమణకు ఈ నెల 11న తన భార్య, కుమారుడితో కలిసి విజయవాడ వెళ్లాడు. చిన్నకుమారుడి ఇంట్లో కోళ్లు ఉండడంతో వాటికి కాపలాగా అప్పయ్యమ్మ గత మూడు రోజులుగా ఆ ఇంట్లో ఉంటుంది. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో టీవీ చూస్తున్న ఆమె వద్దకు పెదమనువడు గౌరి వచ్చి నిద్ర పొమ్మని చెప్పి టీవీ ఆప్‌చేసి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం 10గంటలైనా అప్పయ్యమ్మ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో పెద్దకోడలు లక్ష్మి వెళ్లి చూసింది. తలుపునకు గెడపెట్టి ఉండడంతో వేరొకరి సాయంతో వెనుక వైపు వెళ్లి తలుపులు తోసి చూడగా ఇంట్లో అప్పయ్యమ్మ కనిపించలేదు. ఆమె కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా ఇంటికి సుమారు 150 మీటర్ల దూరంలో రక్షిత మంచినీటి పథకం ట్యాంకు, ఓ చిన్న గది చుట్టూ ఉన్న ప్రహరీ సమీపంలో అప్పయ్యమ్మకు చెందిన సెల్‌పోన్, డబ్బులు భద్రపరచుకొనే గుడ్డ సంచి (చిక్కాం) కనిపించింది. దీంతో ప్రహరీ లోపలకు వెళ్లి చూడగా అప్పయ్యమ్మ విగతజీవిగా పడిఉంది. ఆమె ముక్కు, చెవికి కింద, పైన ఉండే సుమారు 5తులాల బంగారు ఆభరణాలు లేకపోవడాన్ని గుర్తించారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐ వి.పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ టీం వచ్చి ఆధారాలను సేకరించారు. ఇంట్లోనే ఆమెను హత్య చేసి బంగారాన్ని దొంగిలించి మృతదేహాన్ని ప్రహరీ లోపల పడేశారా? లేక హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ప్రహరీలోకి ఈడ్చుకొచ్చి బంగారాన్ని దొంగిలించారా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. దొంగలైతే మృతదేహాన్ని 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి తుప్పల్లో పడేయడమేంటి? తెలిసినవారే చేశారా? ఇలా అనేక కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. అయితే అప్పయ్యమ్మ ఒంటిపై ఉన్న బంగారాన్ని మాత్రమే దోచుకెళ్లి, ఇంట్లో ఏమీ చోరీ చేయకపోవడంపై స్థానికులు, పోలీసుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై సీఐ కె.దుర్గా ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.