they don't change! ఊహు.. వీరు మారరు!
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:20 AM
they don't change! కలెక్టర్ రామసుందర్‌రెడ్డి వారం కిందట కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్ చేశారు. నాలుగు నెలల క్రితమే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన అప్పలరాజు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోరంబోకు (చెరువు) స్థలంగా రికార్డుల్లో నమోదై ఉన్న భూమిని జిరాయితీగా ఇతరులకు మ్యూటేషన్ చేశారని ప్రధాన ఆరోపణ.
ఊహు.. వీరు మారరు!
చర్యలు తీసుకుంటున్నా మారని అధికారుల తీరు
అక్రమాలకు నిలయంగా మారిన రెవెన్యూ విభాగం
చూచిరాతలకు చిరునామాగా ప్రైవేటు విద్యాసంస్థలు
గతంలో ఎప్పుడూ లేదని కొత్తవలసవాసుల ఆవేదన
శృంగవరపుకోట, నవంబరు29 (ఆంధ్రజ్యోతి):
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డి వారం కిందట కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్ చేశారు. నాలుగు నెలల క్రితమే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన అప్పలరాజు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోరంబోకు (చెరువు) స్థలంగా రికార్డుల్లో నమోదై ఉన్న భూమిని జిరాయితీగా ఇతరులకు మ్యూటేషన్ చేశారని ప్రధాన ఆరోపణ. ఆ మండలానికి చెందిన ఓ రైతు మ్యూటేషన్ కోసం తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్డీవో విచారించి నివేదిక అందించిన మరుసటి రోజే కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
- కొత్తవలసలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. సబ్జెక్టు వారీ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి చూసి రాసుకొనేందుకు ఈ పరీక్ష కేంద్రంలో అవకాశం కల్పించారు. ఈ విషయం బయటకు పొక్కింది. పరీక్షల నిర్వహణ అధికారులు తనిఖీల్లో చూచి రాతలకు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థులను పట్టుకున్నారు. ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తుండడంపైనా చర్యలు తీసుకున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం దూరవిద్యా కేంద్ర అధికారులు రెండు రోజుల క్రితం ఈ కేంద్రాన్ని పరిశీలించారు. చూచి రాతల నివారణకు ప్రత్యేక కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ఆ పరీక్ష కేంద్రం కొనసాగిస్తారా.. లేదా అనేది తేలనుంది.
- ఇలా అక్రమాలకు నిలయంగా రెవెన్యూ అధికారులు, పరీక్షల్లో చూచి రాతలకు చిరునామాగా ప్రైవేటు విద్యాసంస్థలు మారాయని జిల్లాలో కొత్తవలస పేరు మారుమోగుతోంది. జిల్లా పరిధిలో ఉన్న మండల కేంద్రమైనప్పటికీ మహా విశాఖనగరానికి ఆనుకుని ఉంది. దాదాపుగా కలిసి ఉందని చెప్పాలి. దీంతో ఇక్కడ భూముల ధరలు బంగారాన్ని మించి పలుకుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో కబ్జాలు, మరొకరి భూమిని సొంతం చేసుకొనేందుకు నకిలీ డాక్యూమెంటులను సృష్టించడం, కొంత మంది రెవెన్యూ అధికారులను లోబర్చుకొని అక్రమాలకు పాల్పడడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు భారీ లేవుట్‌లు వేశారు. రూ.కోట్లు గడించారు. వారికి సహకరిస్తూ సర్వీస్‌లో మచ్చతెచ్చుకుంటున్నవారు కొందరైతే, ఉద్యోగం ఆఖరులో లంచగొండి అధికారులుగా ముద్రవేసుకున్నవారు మరికొందరు.
ఇలా ఇక్కడ ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఓ తహసీల్దార్‌ను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. అంతకుముందు మరో తహసీల్దార్ జైలుకు వెళ్లారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌లలో అత్యధిక శాతం మంది ఏదో ఒక ఆరోపణతో అర్ధాంతరంగా బదిలీ కావడమో, ఉన్నతాధికారుల చర్యలకు గురవడమో, లేదంటే ముందుగానే సెలవుపై వెళ్లిపోవడమో జరుగుతోంది. ప్రస్తుతం సస్పెండ్ అయిన తహసీల్దార్‌పై లెక్కలేనన్ని ఫిర్యాదులున్నాయి. దీంతో ఇతనిపై అంతర్గత విచారణ చేపట్టారు.
ఆరోపణలు ఇలా..
కొత్తవలస మండల పరిధిలోని చిన్నిపాలెం గ్రామంలో 10.36 ఎకరాల విస్తీర్ణం కలిగిన సర్వే నెం.95 భూమికి ఆన్‌లైన్‌లో అడంగల్ సక్రమంగా లేకుండా 3.71 ఎకరాలను సర్వే నెంబర్ 95-2గా ఆర్.డ్రైగా సృష్టించారు. దీన్ని ఓ రైతుకు అనుకూలంగా తహసీల్దార్ రాసిచ్చేశారు. అలాగే అదే మండలం చింతలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 52-4పి, 52-7,52-12, 52-13,52-14,52-15పీ, 52-18, 52.8,53-12పీ నెంబర్‌లకు సంబంధించి నిబంధనలు పాటించకుండా సబ్ డివిజన్ చేశారు. వెబ్‌లాండ్‌లోనూ నమోదు చేశారు. జాయింట్ కలెక్టర్ ధ్రువీకరణ తప్పనిసరి అయినా పట్టించుకోలేదు. ఇవన్నీ తీవ్రమైన అవకతవకలుగా భావించిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు భూరికార్డుల్లో మార్పుల కోసం డబ్బులు తీసుకొని పనిచేయలేదని మిందివలస గ్రామానికి చెందిన సూరిబాబు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. రూ.3లక్షలు అడిగారని, రూ.2లక్షలకు ఒప్పందం కుదిరందని, ఆ సొమ్ము ఇచ్చినా పనిచేయడం లేదని ఆరోపించారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలోనే చూచిరాతల ఆరోపణలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల వ్యవహారం పత్రికల పతాక శీర్షికలకెక్కింది. ఈ కళాశాలలో ఆంధ్ర విశ్వ విద్యాలయం దూర విద్య విభాగం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వద్ద సబ్జెక్టు లెక్కన రూ.4వేల నుంచి రూ.6వేల వరకు వసూలు చేసి చూచి రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పరీక్షలు రాసే ఇద్దరు విద్యార్థులు ఆరోజు పరీక్షల్లో రాయాల్సిన ప్రశ్నలు ముందుగా లీక్ కావడంతో వాటికి సంబంధించిన జవాబులను మైక్రో జిరాక్స్‌లు తీసుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరు పరీక్షలు జరుగుతున్న తీరుపై మాట్లాడుకుంటుండగా ఎవరో వీరు గమనించకుండా వీడియో తీసేసారు. అది సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఆంధ్ర విశ్వ విద్యాలయం అధికారులు తేరుకొని తనిఖీలు చేపట్టారు. విచారణ చేస్తున్నారు. గతంలో కూడా కొత్తవలసలోని మరో ప్రైవేటు కళాశాలలో ఇలాంటి ఘటనే జరగడంతో జిల్లా వ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలతో జిల్లాలో ఎక్కడ విన్నా కొత్తవలస గురించే మాట్లాడుకోవడం కనిపిస్తోంది.