They are worried.. They are hopeful ఆందోళనలో వారు.. ఆశల్లో వీరు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:56 PM
They are worried.. They are hopeful భూములు తీసుకున్న సమయంలో ఎకరాకు రూ.2,00,500 ఇచ్చారు. మార్కెట్ విలువను పాటించలేదు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఆ భూమికి సమాన విలువ కలిగిన షేర్లు ఇస్తామన్నారు.
ఆందోళనలో వారు.. ఆశల్లో వీరు
నిరసన బాటలోనే జిందాల్ భూ నిర్వాసితులు
ఎటూ తేల్చని పరిశ్రమ యాజమాన్యం
ఎంఎస్‌ఎంఈ పార్కుల స్థాపనకు పడని పునాది రాయి
ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత
శృంగవరపుకోట డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి):
భూములు తీసుకున్న సమయంలో ఎకరాకు రూ.2,00,500 ఇచ్చారు. మార్కెట్ విలువను పాటించలేదు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఆ భూమికి సమాన విలువ కలిగిన షేర్లు ఇస్తామన్నారు. పరిశ్రమలో ఉద్యోగం చేసేందుకు ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడిలో శిక్షణ ఇచ్చారు. కానీ పరిశ్రమను స్థాపించలేదు. అన్ని వసతులతో కాలనీ నిర్మిస్తామని చెప్పారు. ఇలా ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఎంఎఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణం చేపడతామంటున్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను ఎవరు నెరవేర్చుతారు. ఇన్నాళ్లుగా మాకు జరిగిన నష్టంపై న్యాయం కావాలి. లేదంటే మా భూములను మాకు తిరిగి ఇచ్చేయండి.
- 176 రోజులుగా శృంగవరపుకోట మండలం బొడ్డవరలో జిందాల్ భూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలో వినిపిస్తున్న మాటలివి.
ఓ పక్క ఆందోళన కొనసాగిస్తూనే మరోపక్క ప్రతి సోమవారం జరిగే కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతులు ఇస్తున్నారు. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులోనూ దావా ఉంది. ఇలా అన్ని వైపుల నుంచి భూ నిర్వాసితులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న జిందాల్ పరిశ్రమ నుంచి పలుకు, పలుకు లేదు. వీరి సమస్యను ఎటూ తేల్చకపోవడంతో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి పునాది రాయి పడలేదు. ఆ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిశాక నిరుద్యోగ యువత ఆశలకు రెక్కలు తొడిగాయి. వివిధ రకాల సాంకేతిక విద్య, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదవులు చదువుకున్న వారు కూడా స్థానికంగా ఉండి ఉద్యోగం చేసుకొనే అవకాశం దొరుకుతుందని కలలు కంటున్నారు. పరిశ్రమల రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల మంత్రి మండలి ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఏ నెలకానెల ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా నెల రోజుల క్రితం వరకు బోసిపోయి ఉండే జిందాల్ తాత్కాలిక కార్యాలయానికి ఇప్పుడు రంగులు అద్దారు. అదనంగా కంటైనర్ కార్యాలయం తెరిచారు. శాశ్వత హెలిప్యాడ్ కూడా రూపుదిద్దుకుంది. జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియమ్ లిమిటెడ్ స్థానంలో నూతనంగా జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్ పార్కుగా బోర్డు వెలిసింది. అయితే ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి భూమి పూజ ఎప్పుడు జరుగుతుందో పరిశ్రమ యాజమాన్యం స్పష్టత ఇవ్వలేకపోతోంది. భూ నిర్వాసితులు ఉద్యమం చేస్తుండడంతో కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి వల్ల ఇటు భూనిర్వాసితులకు, అటు నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోంది.
ఫ దాదాపు ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ జిందాల్ యాజమాన్యం కనీసం రైతులతో ఒక్కసారి కూడా చర్చలు జరపలేదు. భూ నిర్వాసితులు రోజుకొక్కటి చొప్పున అందిస్తున్న ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులకు పనిభారం పెరుగుతోంది. అప్పట్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా మళ్లీ వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి ఒక్క అడుగు కూడా పడకపోవడంతో నిరుద్యోగ యువతలో నిరాశ గూడు కట్టుకుంటోంది.