కష్టపడి తడుపుతున్నారు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:41 PM
ఒకపక్క వర్షాలు కురవడం లేదు.. మరోపక్క జలశయాల నుంచి సాగునీరు విడుదల కావడం లేదు.. ఇంకొకపక్క వేసవిని తలపించేలా ఎండలు వెరసి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వర్షాలు లేక ఎండిపోతున్న వరి నారు
కాపాడుకునేందుకు రైతుల పాట్లు
డ్రమ్ములతో నీటిని తెచ్చి తడుపుతున్న వైనం
మక్కువ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఒకపక్క వర్షాలు కురవడం లేదు.. మరోపక్క జలశయాల నుంచి సాగునీరు విడుదల కావడం లేదు.. ఇంకొకపక్క వేసవిని తలపించేలా ఎండలు వెరసి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మక్కువ మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా గ్రామాల్లో వరి నారు ఎండిపోతుంది. దీంతో వరి నారును కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. టైరు బండ్లపై సుదూర ప్రాంతాలకు వెళ్లి బావుల్లోని నీటిని డ్రమ్ముల్లో నింపి తీసుకువచ్చి నారును తడుపుతున్నారు. వెంగళరాయసాగర్ నుంచి సాగునీరు విడుదలైనా ఈ కష్టాలు తప్పేవి. కానీ, ఇంతవరకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా చుక్క నీరు కూడా రావడం లేదు. దీంతో ఎండల తీవ్రతకు నారు మడి ఎండిపోకుండా రైతులు నీటిని తీసుకువచ్చి తడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీఆర్‌ఎస్ జలాశయం నుంచి సాగునీరు త్వరగా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.