Share News

వారు లేరు.. వీరు రారు?

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:27 AM

సీతంపేట ఏరియా ఆసుపత్రిలో కీలక విభాగాల్లో వైద్యుల కొరత నెలకొంది.

 వారు లేరు.. వీరు రారు?
సీతంపేట ఏరియా ఆసుపత్రి

- సీతంపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత

- చర్మ, నేత్ర, సివిల్‌ సర్జన్‌ విభాగాల్లో పోస్టులు ఖాళీ

-మెడికల్‌ లీవ్‌లో చిన్నపిల్లల డాక్టర్లు

- రోగులకు తప్పని ఇబ్బందులు

- చిన్నపిల్లల పరిస్థితి దయనీయం

సీతంపేట రూరల్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రిలో కీలక విభాగాల్లో వైద్యుల కొరత నెలకొంది. దీంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఆస్పత్రిలో వందల సంఖ్యలో ఓపీ నమోదవుతుంది. సీతంపేట ఏజెన్సీతో పాటు కొత్తూరు, భామిని, బత్తిలి, హిరమండలం తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో రోగులు సీతంపేట ఆసుపత్రికి వస్తుంటారు. అపడమిక్‌ సీజన్‌లో ఏకంగా 400వరకు ఓపీ నమోదవుతుంటుంది. అయితే, వైద్యుల కొరతతో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. మొత్తం 21మంది వైద్యులకు గాను 18 మంది ఉన్నారు. చర్మ(డెర్మటాలజీ), నేత్ర (ఆప్తాలిమిస్ట్‌), సివిల్‌ సర్జన్‌ (సీఎస్‌ ఆర్‌ఎం) విభాగాలకు సంబంధించి వైద్యాధికారుల పోస్టులు కొంత కాలంగా ఖాళీగాఉన్నాయి. చర్మ, నేత్ర, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలు అందకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

సెలవుల్లో చిన్నపిల్లల వైద్యులు..

ఆసుపత్రిలో ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు గత కొంత కాలంగా మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. వైద్యాధికారి వెంకట్రావు అనారోగ్య సమస్యలతో 2023లో పార్వతీపురానికి డెప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. మరో చిన్నపిల్లల వైద్యాధికారి రవీంద్ర మూడు నెలల డెప్యుటేషన్‌పై సీతంపేట ఆసుపత్రికి వచ్చారు. రెగ్యులర్‌ వైద్యాధికారి మనోజ్‌తో పాటు రవీంద్ర అపడమిక్‌ సీజన్‌లో చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించారు. అయితే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా మనోజ్‌, రవీంద్ర వేరేచోటకు బదిలీ అయ్యారు. వీరిస్థానంలో రాజాం నుంచి వైద్యుడు కోటేశ్వరరావు బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈయన నెలరోజుల పాటు ఇక్కడ పనిచేసి మెడికల్‌ లీవ్‌ పెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రిలో చిన్నవైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఎన్‌ఆర్‌సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)వైద్యులతో చిన్నారులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

చిన్నారుల్లో బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌..

ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా చిన్నారులు బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. సీతంపేట ఆసుపత్రికి సోమ, మంగళ, బుధవారం కలిపి చిన్నారుల ఓపీ 125వరకు నమోదైంది. వీరిలో 30మందికి పైగా ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లగా చేరి చికిత్స పొందుతున్నారు. జ్వరం, బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా చిన్నారులు ఏరియా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. వీరితో పాటు ఐటీడీఏ పరిధిలోని పలు ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు.

పట్టించుకోని వైద్యశాఖ..

సీతంపేట ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తున్నా వైద్యశాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో ఎన్‌సీడీ, ఎన్‌ఆర్‌సీకి ప్రత్యేక వైద్య నిపుణులు ఉండాల్సి ఉంది. పలు విభాగాల్లో 20మందికి పైగా సిబ్బంది ఉండాలి. కానీ 16పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్‌ వైద్యులతో పాటు సిబ్బందిని కూడా నియమించాలని గిరిజన సంఘాల నాయకులు కోరతున్నారు.

ఉన్నతాధికారులకు తెలియజేశాం..

సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు సెలవుపై ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలతో వచ్చే చిన్నారులకు ఎన్‌ఆర్‌సీ వైద్యులతో సేవలందిస్తున్నాం. చర్మ, నేత్ర, సివిల్‌ సర్జన్‌, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.

-బి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌, ఏరియా ఆస్పత్రి, సీతంపేట.

Updated Date - Nov 14 , 2025 | 12:27 AM